బిగ్ షాకిచ్చిన రైల్వే- ఎకాఎకిన రద్దు
Railways: రైల్వే బోర్డు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఖాళీగా గ్రూప్ సీ పోస్టుల కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియలో అక్రమాలు, పలు అవకతవకలు చోటు చేసుకున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న ఈ సెలెక్షన్లన్నీ కూడా రద్దు చేసినట్లుగా పరిగణించాలని అన్ని రైల్వే జోన్ జనరల్ మేనేజర్లకు సర్క్యులర్ పంపించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కొత్తగా ఎలాంటి సెలక్షన్లను చేపట్టకూడదని ఇందులో పేర్కొంది. డిపార్ట్‌మెంటల్ ఎంపిక వ్యవస్థ మొత్తాన్నీ కూడా పునఃసమీక్షించాలని యోచిస్తోంది రైల్వే బోర్డు.

రైల్వేలో ఉన్న అన్ని శాఖలు, విభాగాల్లో ఏర్పడే ఖాళీలకు అనుగుణంగా, వాటి అవసరం ఉన్న సమయంలో మాత్రమే ఈ సెలెక్షన్ చేపట్టేలా ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. దీనికి అవసరమైన కొత్త గైడ్ లైన్స్ జారీ చేయాలని భావిస్తోంది. మరింత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను చేపట్టాలనేది యోచిస్తోంది.
అన్ని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ పరీక్షలను కూడా సెంట్రలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ద్వారా నిర్వహించడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును భాగస్వామ్యం చేయనుంది. రైల్వే శాఖలో ప్రమోషన్ల కోసం మరింత పారదర్శకంగా, న్యాయంగా పరీక్షల ప్రక్రియలో మార్పులు చేర్పులు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ పరీక్షలను రైల్వే డివిజన్లు, జోన్ల వారీగా అంతర్గతంగా నిర్వహించేవారు. ఈ పరీక్షలలో పెద్ద ఎత్తున అవినీతి, అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకుంటోన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫిర్యాదులు సైతం అందాయి. దీనితో- ఆర్ఆర్‌బీ పర్యవేక్షణలోనే అన్ని డిపార్ట్‌మెంటల్ పరీక్షల ప్రక్రియను కేంద్రీకృతం చేయాలని నిర్ణయించింది.
ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్‌లో తూర్పు మధ్య రైల్వేకు చెందిన 26 మంది రైల్వే అధికారులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీని తరువాతే రైల్వే బోర్డు ఈ నిర్ణయాలను తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిపార్ట్‌మెంటల్ పరీక్ష పేపర్లను లీక్ చేయడంలో ఆయా అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications