తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలు పిబ్రవరిలోగా విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్ణయించింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్-1లో అమలు చేయాలని భావిస్తోంది. ఇక, ఫిబ్రవరిలో 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రారంభించింది. మూల్యాంకనం, మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం అవసరమని టీజీపీఎస్సీ భావిస్తోంది. మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్టులకు 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్ల పరీక్షలు రాశారు.
కాగా, అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ రెండో వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండో దశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు.
ఆ తర్వాత మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. కాగా, గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన తర్వాతే.. గ్రూప్ 2,3 ఫలితాలను వెల్లడించాలని భావిస్తోంది. దీంతో బ్యాక్‌లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తోంది. అంటే వచ్చే ఫిబ్రవరి తర్వాతే గ్రూప్ 2, 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications