తెలంగాణ ఆరోగ్యశాఖలో 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయా ఉద్యోగాలకు అర్హులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా, తెలంగాణ ఆరోగ్యశాఖలో 1500కుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మహిళ(MPHA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యక్రమాల్లో అందించిన సేవలను ప్రాతిపదికగా తీసుకుని ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మొత్తం 100 పాయింట్లకు గానూ 80 పాయింట్లు అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, మిగిలిన 20 పాయింట్లు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో అందించిన సేవలకు ఉంటాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు పాయింట్ల రూపంలో ప్రాధాన్యం ఉంటుంది. అర్హత పరీక్ష అనంతరం మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకటో జోన్‌లో 169 పోస్టులు, రెండో జోన్లో 225, మూడో జోన్లో 263, నాలుగో జోన్లో 237, ఐదో జోన్లో 241, ఆరో జోన్లో 189, ఏడో జోన్లో 196 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
విద్యార్హతలు, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications