నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఎన్ని పోస్టులంటే..?
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సోమవారం 17వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మంగళవారం గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. రాష్ట్రంలో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది.

తాజాగా, మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. వీటిలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డీఎస్సీ పోస్టులు 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41, ఎంపీడీవో 121 పోస్టులు చొప్పుల భర్తీ చేయనున్నారు. మే 2 నుంచి మే నెలాఖరు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంటర్వ్యూలు లేకుండానే ఈ నియామకాలు జరగనున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సోమవారం వెలువడిన పోలీసు నోటిఫికేషన్
తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ భాగాల్లో కలిపి మొత్తం 17,099 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. భారీ ఎత్తున కానిస్టేబుల్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐ, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు తదితర వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.












Click it and Unblock the Notifications