నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాలిటిక్కెట్లు విడుదల...జూన్ 9న పరీక్ష
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఈ నెల 9వ తేదీన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల కోసం ఎన్నికల ముందే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు నేడు (జూన్ 1) అందుబాటులోకి రానున్నాయి.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగలరు. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పేపర్ల లీకేజీ నేపథ్యంలో ఏ చిన్న తప్పునకు అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి మరికొన్ని పోస్టులను కలిపి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కాగా మార్చి 16 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.
జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రిలిమ్స్ లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారు మాత్రమే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. రెండో దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications