అందుబాటులోకి గురుకుల పోస్టులకు పరీక్ష హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్: తెలంగాణలోని గురుకులాల్లో 9210 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లు నేటి నుంచి అంటే మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 1న జరిగే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డ్ వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in/లో లాగిన్ కావాలి.
ఆ తర్వాత ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లు పొందవచ్చు. మిగితా పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ పరీక్షల షెడ్యూల్‌లో గురుకుల నియామక బోర్డ్ స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది.

మొదట ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డ్ తెలిపింది. కాగా, గురుకులాల్లో మొత్తం 9210 పోస్టులకు గురుకుల నియామక బోర్డ్ 9 నోటిఫికేషన్లు విడివిడిగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.63 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. అంటే, ఒక్కో పోస్టుకు సగటున 29 మంది చొప్పున పోటీ పడుతున్నారు.
పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిప్టులో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిప్టు పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు. మరోవైపు, స్టాఫ్ నర్స్ హాల్ టికెట్లు కూడా ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే.
స్టాఫ్ నర్స్ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఎంహెచ్ఎస్ఆర్బీ) అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm లో హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.
రాష్ట్రంలో మొత్తం 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)ను హైదరాబాద్, వరంగల్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాల్లో మూడు షిప్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు, 12.30 నుంచి 1.50 గంటల వరకుప, సాయంత్రం 4 గంటల నుంచి 5.20 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా, ఈ పోస్టులకు తొలిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications