రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్: పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు జరగనుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. రేపు పరీక్ష జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది.
పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోమని తెలిపింది. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదని పేర్కొంది.

వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేచర్‌తో బబ్లింగ్ కచేసే ఓఎంఆర్ షీట్ చెల్లదు అని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించతలపెట్టిన ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్ తర్వాత వీటిని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆదివారం అంటే జూన్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని.. 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయడం జరుగుతుందని పేర్కొంది.
జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పరీక్ష జరగనుంది. అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. తాజాగా మళ్లీ తీసుకోవాలని కమిషన్ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా టీఎస్‌పీఎస్సీ బోర్డ్ సమాలోచనలు చేసి.. ఈ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications