ఒక్క సినిమాకే ఐదేళ్లు.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమేనా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందించే భారీ నిర్మాణాలు, విజువల్ ఎక్స్పీరియన్స్ మరే ఇతర డైరెక్టర్ సినిమాల్లోనూ చూడలేం. ఆయన సృష్టించే విజువల్ వండర్స్ వెనుక సుదీర్ఘమైన ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనులు ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కూడా ఆయన ఇప్పటికే చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో పోలిస్తే షూటింగ్ రోజుల్లో ఈ కొత్త సినిమా దాదాపు 30 శాతం వేగంగా జరుగుతోంది. షూటింగ్ ప్రక్రియ కొంత వేగంగా సాగుతున్నప్పటికీ.. ఇక్కడ టైమ్‌లైన్ గమనించాల్సి ఉంటుంది. రాజమౌళి నుంచి 'ఆర్ఆర్ఆర్' సినిమా 2022లో విడుదల కాగా.. తదుపరి చిత్రం 'వారణాసి' 2027లో మాత్రమే థియేటర్లలోకి రానుంది. దీనర్థం రెండు సినిమాల మధ్య ఏకంగా ఐదేళ్ల విరామం వస్తోంది. అంటే ఈ దశాబ్ధంలో రాజమౌళి నుంచి కేవలం రెండే సినిమాలు రాబోతున్నాయి.

సాధారణ స్థాయి కథాంశంతో తెరకెక్కించే సినిమాలకే రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకుంటుంటే.. ఇక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'మహాభారతం' పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. 'మహాభారతం' కావాల్సిన ప్రీ-ప్రొడక్షన్, భారీ వర్క్, సుదీర్ఘ షూటింగ్ సమయం చాలా ఎక్కువ. కాబట్టి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించడం కూడా కష్టమే.
దీనికి తోడు 'మహాభారతం' స్టోరీని పూర్తిగా ఆవిష్కరించడానికి దానిని పలు భాగాలుగా తెరకెక్కించాలని ఉందంటూ రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే గనుక జరిగితే ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దశాబ్ధాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే నటీనటులను సంవత్సరాలు లేదా దశాబ్దాల తరబడి ఒకే ప్రాజెక్ట్ కోసం ఉంచడం మాటల్లో చెప్పినంత తేలికైన విషయం కాదు. అనుబంధంగా వచ్చే అనేక చిక్కులు, ,సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే రాజమౌళి ఈ ప్రణాళికతో ముందడుగు వేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఓ సాధారణ ప్రాజెక్టుకే ఐదేళ్ల సమయం పడుతున్నప్పుడు 'మహాభారతం' లాంటి భారీ కళాఖండాన్ని రాజమౌళి పూర్తి చేయగలరా? ఇది ఆయనకు కూడా అందుబాటులో లేని సరిహద్దుగా మారిపోతోందా? అనే అనుమానాలు సినీ విశ్లేషకుల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications
