అద్భుతం... చాలా సంవత్సరాల తర్వాత 100 రోజులు ఆడిన సినిమా
ఈరోజుల్లో సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడటం అనేది కలగా మారిపోయింది. ఓటీటీలు అందుబాటులోకి రావడం, శాటిలైట్ ఛానల్స్ లో కూడా వెంటనే కొత్త సినిమాలు వేస్తుండటంతో ప్రజలు థియేటర్లకు, మల్టీప్లెక్స్ లకు వెళ్లడం తగ్గించారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిసికట్టుగా ప్రభుత్వాలతో మాట్లాడుకొని మొదటి రెండు వారాలు లేదంటే 10 రోజులు టికెట్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచేసుకొని అభిమానాన్ని దోపిడీ చేసుకుంటున్నారు. దీనికితోడు థియేటర్ల క్యాంటిన్లలో మరో ధరల దోపిడీ ఉంటుంది. ఇన్ని దోపిడీలను తట్టుకోలేమని భావించిన సినీ ప్రియులంతా తమ ఇళ్లల్లోనే హోం థియేటర్లు ఏర్పాటు చేసుకొని వాటిల్లో కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తున్నారు.
సంచలన విజయం సాధించింది
దీంతో చాలావరకు సింగిల్ థియేటర్లు వాణిజ్య సముదాయాలుగా, కల్యాణ మండపాలుగా మారిపోయాయి. ఇటువంటి తరుణంలో ఓ సినిమా అద్భుతం చేసింది. శతదినోత్సవాన్ని మరిచిపోయిన సినీ పరిశ్రమకు మళ్లీ ఆ వేడుకను గుర్తుచేసి వైభవంగా నిర్వహించుకునేలా చేసింది. ఆ సినిమా ఏదో కాదు.. అమరన్. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతోపాటు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. విశ్వనటుడు కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘనవిజయంలో శివకార్తికేయన్, సాయిపల్లవి పోటీ పడి నటించిన నటనే ప్రధాన పాత్ర.

ముకుంద్ వరదరాజన్ నిజ జీవితంతో..
ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మించారు. తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకొని కొత్త రికార్డులను నెలకొల్పింది. దీంతో నిర్మాత కమల్ హాసన్ ఈ సినిమా శతదినోత్సవాన్ని నిర్వహించారు. సినిమా క్లైమాక్స్ లో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. సినిమా విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమంటూ పేరుపేరునా అందరికీ కమల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను తమిళ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా టీవీల్లో లైవ్ చూశారు. ప్రస్తుత తరానికి శతదినోత్సవాలు జరుగుతాయని, టీం సభ్యులందరికీ 100 రోజుల పేరుతో షీల్డ్ లు అందజేస్తారని ఇది చూసిన తర్వాతే తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications