త్రివిక్రమ్ దెబ్బకు వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ పెద్ద సినిమా విడుదల ఖరారైతే అది అనేక చిన్న సినిమాల విడుదల ప్రణాళికలపై ప్రభావం చూపిస్తుంది. దానికి తాజా ఉదహరణే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం. ఈ భారీ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో 'ఇట్లు అర్జున', 'సమ్మర్ హాలిడేస్'అనే రెండు చిన్న చిత్రాలు తమ విడుదల తేదీని నవంబర్ 6కి వాయిదా వేసుకున్నాయి.
ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ రెండు చిన్న సినిమాలు మొదట అక్టోబర్ 9న రిలీజ్ అవుతాయని ప్రకటించారు. అయితే 'ఆదర్శ కుటుంబం' కూడా పోటీలోకి రావడంతో వారు అక్టోబర్ 30కి మారాలని భావించారు. కానీ ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయడానికి అధికారికంగా నిర్ణయించడంతో ఈ రెండు సినిమాలు మళ్లీ పోటీ నుంచి తప్పుకుని నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' సినిమా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'కల్ట్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నేరుగా పోటీ పడనుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొననుంది.

చిన్న చిత్రాల నిర్మాతలకు విడుదల తేదీని ఎంచుకోవడం అనేది కేవలం ఒక రోజును ఖరారు చేసుకోవడం మాత్రమే కాదు. మార్కెట్లో పోటీ, థియేటర్ల లభ్యత, తగినన్ని స్క్రీన్లు దక్కుతాయా లేదా అనే కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. అంతే కాకుండా విడుదల తేదీని పదే పదే మార్చడం వల్ల పబ్లిసిటీ ప్రణాళికలపై, బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది.
తాజాగా జరిగిన ఈ మార్పులు చిన్న సినిమాలకు అనువైన విడుదల సమయాన్ని వెతుక్కోవడంలో ఎదురయ్యే సవాళ్లను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' , 'కల్ట్' సినిమాలు బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవుతుండగా.. నవంబర్ 6న విడుదలయ్యే 'ఇట్లు అర్జున', 'సమ్మర్ హాలిడేస్' సినిమాలు ఏ మేరకు రాణిస్తాయో వేచి చూడాల్సిందే.













Click it and Unblock the Notifications
