యాక్షన్ లేదు.. రక్తపాతం లేదు.. దుల్కర్ కొత్త సినిమా ట్రైలర్‌లో అసలు కథ ఇదే!
విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్, నూతన నటి సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'ఆకాశంలో ఒక తార'. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. రక్తపాతం, భారీ యాక్షన్ సీన్లకు దూరంగా.. కేవలం భావోద్వేగాలు, మానవ సంబంధాల నేపథ్యంలో సాగే ఓ అందమైన స్టోరీని ఈ ట్రైలర్ ఆవిష్కరించింది.
స్టోరీ ఏమిటంటే?
ఆస్ట్రోనాట్(వ్యోమగామి) కావాలనే బలమైన ఆశయం ఉన్న కల్పన అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె కలను చూసి చుట్టుపక్కల వారు ఎగతాళి చేసినా.. అసాధ్యమని నిరుత్సాహపరిచినా కల్పన తన లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోదు. సరిగ్గా ఆ సమయంలో ఆమె ఆశయాన్ని అర్థం చేసుకుని.. దాన్ని నెరవేర్చుకోవడానికి అండగా నిలిచే కృష్ణ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి అడుగుపెడతాడు. ఆమె కలను సాకారం చేసే బాధ్యతను కృష్ణ ఎలా భుజానికెత్తున్నాడనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

నటీనటుల అభినయం
కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఎంతో పరిణతితో భావోద్వేగభరితంగా కనిపించారు. ముఖ్యంగా సున్నితమైన సీన్లతో ఆయన సహజ నటన ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న సాత్విక వీరవల్లి.. అమాయకత్వం, పట్టుదల కలగలిసిన కల్పన పాత్రలో ఒదిగిపోయింది. ఏరోస్పేస్ ఇంజనీర్‌గా శృతి హాసన్ కీలక పాత్రలో మెరవగా.. రుహానీ శర్మ పాత్రను కూడా ట్రైలర్‌లో పరిచయం చేశారు.
సాంకేతిక హంగులు
సామాజిక, భావోద్వేగ అంశాలు ఉన్న స్టోరీని ఎంచుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని.. వినోదం, కుటుంబ అనుబంధాలు, డ్రామాను సమపాళ్లలో మేళవించి కథనాన్ని నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు రిచ్ లుక్‌ను అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ సీన్లలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేసింది. కేవలం అంతరిక్ష ప్రయాణం గురించి మాత్రమే కాకుండా.. ఒకరి కలను నిజం చేయడానికి తోడుగా నిలిచే మనుషుల గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














Click it and Unblock the Notifications
