Aakasamlo Oka Tara Review: కథ రొటీనే.. కానీ ఎమోషన్స్ అదిరిపోయాయ్!
టైటిల్: ఆకాశంలో ఒక తార
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహానీ శర్మ, నాజర్, మురళీ శర్మ, స్వేసిక తదితరులు
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
నిర్మాతలు: సందీపు గుణ్ణం, రమ్య గుణ్ణం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా
రచన, దర్శకత్వం: పవన్ సాధినేని
స్టోరీ
ఓ మారుమూల గ్రామానికి చెందిన కల్పన(సాత్విక వీరవల్లి) ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె కలను తన కలగా భావించి అడుగడుగునా అండగా నిలుస్తాడు భర్త కృష్ణ(దుల్కర్ సల్మాన్). ఎన్నో అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటూ కల్పన అంతరిక్షం వైపు తన ప్రయాణాన్ని ఎలా సాగించింది? ఈ క్రమంలో ఆ భార్యాభర్తలు చేసిన త్యాగాలేంటి? వారి అనుబంధం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే 'ఆకాశంలో ఒక తార ' కథ.

నటీనటులు ఎలా నటించారంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కృష్ణ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. తన ఇమేజ్‌ను పక్కనపెట్టి హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న స్టోరీని ఎంచుకోవడం అభినందనీయం. భార్య ఆశయాలకు రెక్కలు తొడిగే భర్తగా ఆయన పలికించిన భావోద్వేగాలు హృదయాన్ని తాకుతాయి. తొలి సినిమా అయినప్పటికీ సాత్విక వీరవల్లి అద్భుత నటనతో ఆకట్టుకుంది. కల్పన పాత్రలో ఆమె చాలా సహజంగా, అందంగా కనిపిస్తూ తెలుగు తెరకు మరో ప్రతిభావంతమైన నటి దొరికిందనే నమ్మకాన్ని కలిగించింది. శృతి హాసన్ పాత్రకు మంచి వెయిట్ దక్కింది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ఉత్తమ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. బిజ్లీ పాత్రలో రుహానీ శర్మ ఒక్క తెలుగు మాట కూడా మాట్లాడకుండానే తన కళ్లతో, హావభావాలతో కృష్ణపై ఉన్న ప్రేమను అద్భుతంగా పండించింది. నాజర్, స్వేసిక తమ పరిధి మేరకు మెప్పించగా.. మురళీ శర్మ పాత్ర అంతగా ప్రభావం చూపలేదు.
విశ్లేషణ
డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమాను ఓ డాక్యుమెంటరీ తరహాలో చాలా సింపుల్‌గా, సహజంగా ప్రారంభించారు. స్టోరీ లీనం కావడానికి కాస్త సమయం పట్టినప్పటికీ.. భార్యాభర్తల మధ్య వచ్చే ఎమోషల్ డ్రామా మొదలయ్యాక సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిల మధ్య వచ్చే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. అయితే కథనం అక్కడక్కడా ఊహించిన విధంగా సాగడం, కొన్ని సీన్లను సౌలభ్యం కోసం మలుచుకున్నట్లు అనిపించడం మైనస్‌గా నిలిచింది. స్పేస్ మిషన్ సీన్లు సాధారణంగా ఉన్నాయి. మురళీ శర్మ ట్రాక్ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్‌లో కల్పన అంతరిక్ష ప్రయాణం ప్రమాదకరమని కృష్ణ అకస్మాత్తుగా భయపడటం, లాంచ్ సమయంలో ఆయన లేకపోవడం వంటివి కాస్త అసహజంగా తోస్తాయి. స్టోరీ రోటీన్ గా అనిపించినా.. బలమైన ఎమోషన్స్ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన విజయానికి కారణమైన భర్త త్యాగాన్ని కల్పన గుర్తుచేసుకునే సన్నివేశం, దేశభక్తితో కూడిన ముగింపు ప్రేక్షకుల కళ్లను చెమర్చేలా చేస్తాయి.
సాంకేతిక విభాగం
జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్లను మరోస్థాయికి తీసుకెళ్లింది. గంగరాజు గుణ్ణం అందించిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ కన్నుల పండువగా ఉంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ..నిడివిని కాస్త తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ.. కొన్ని చోట్ల వాడిన ఏఐ విజువల్స్, వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అంతంతమాత్రంగా ఉన్నాయి.
బలాలు:
*దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటన
*హృదయాన్ని హత్తుకునే భార్యాభర్తల అనుబంధం
*జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, రచన
*ఎమోషనల్ క్లైమాక్స్
బలహీనతలు:
*అంతరిక్ష సీన్లలో లోతు లేకపోవడం
*ఊహించదగిన స్టోరీ
ఫైనల్‌గా..
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, స్వచ్ఛమైన ప్రేమ, త్యాగం, స్ఫూర్తిదాయకమైన కథనంతో 'ఆకాశంలో ఒక తార ' కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ మంచి సినిమా!
రేటింగ్: 3/5.














Click it and Unblock the Notifications
