సైఫ్ అలీ ఖాన్‌కు కత్తిపోట్లు: కీలక స్టేట్‌మెంట్
Saif Ali Khan: బాలీవుడ్ హాట్ స్పాట్ ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.
షాక్‌లో బాలీవుడ్..
ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్‌లో కలకలం మొదలైంది. అజయ్ దేవ్‌గణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తోన్నారు.

హైసెక్యూరిటీ జోన్..
బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది.
దోపిడీ కోసం..
అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తోన్నారు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు.
ఆగంతకుడితో ఘర్షణ..
ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. పనివాళ్లతో కలిసి ఆ అజ్ఞాతవ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీనితో సైఫ్ అలీ అక్కడే రక్తపుమడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.
లీలావతి ఆసుప్రతి సీఈఓ స్టేట్‌మెంట్..
తెల్లవారు జామున 3 నుంచి 3:30 నిమిషాల మధ్య సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. ఆయన శరీరంపై మొత్తం ఆరుచోట్ల గాయాలయ్యాయిన వెల్లడించారు. రెండు చోట్ల లోతుగా కోసుకుపోయినట్లు వివరించారు.
డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో..
న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మటిక్ సర్జన్ లీలా జూన్, అనస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోన్నామని తెలిపారు. ఇప్పటికే రెండుసర్జరీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.
సైఫ్ టీమ్ ధృవీకరణ..
ఈ ఘటనపై సైఫ్ అలీ ఖాన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఓ ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డ విషయాన్ని ధృవీకరించింది. ఇంట్లో దోపిడీ చేయడానికి అజ్ఞాతవ్యక్తి విఫల ప్రయత్నం చేశాడని వివరించింది. ఈ ఘటనలో ఆయనకు కత్తి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.
ముంబై డీసీపీ ఏం చెప్పారు?
ముంబై పోలీసులు కూడా ఈ దాడిపై స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న ఉదంతం పట్ల సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు ముంబై జోన్ 9 డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీక్షిత్ గెడం తెలిపారు. ఆ ఆగంతకుడి కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, అతని కోసం గాలిస్తోన్నామని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications