తెలుగులో సినిమా ఒప్పుకున్న నయనతార.. హీరోగా అతనే?
దక్షిణ భారతదేశంలోని అందరు హీరోయిన్లలో అత్యంత ఖరీదైన హీరోయిన్ గా నయనతార ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక సినిమా చేసేందుకు రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. తాజాగా జవాన్ చిత్రం సంచలన విజయం సాధించడంతో రెమ్యునరేషన్ రూ.12 నుంచి రూ.15 కోట్ల మధ్యలో ఉందని వార్తలు వస్తున్నాయి. తెలుగులోని అగ్ర కథానాయకులందరితో జతకట్టిన నయనతార కొంతకాలంగా ఎటువంటి తెలుగు సినిమాను ఒప్పుకోలేదు. అయితే తాజాగా ఆమె తెలుగులో ఓ సినిమాను ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడు. మొదటగా ఈ సినిమాలో పూజా హెగ్డే అంటూ వార్తలు వచ్చాయి. అయితే పూజా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించబోతోందని, మొదటి హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారంటున్నారు. నయనతార గతంలో వెంకటేష్ తో తులసి, లక్ష్మీ, బాబు బంగారం లాంటి సినిమాలు చేసింది. తెరపై వీరి జంట బాగుంటుందని పేరు వచ్చింది. తాజాగా అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార నటించబోతోందనడంతో మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందంటున్నారు.

వెంకటేష్ ఇటీవలే సైంధవ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారుకానీ అది పూర్తిగా నిరాశపరిచింది. దీంతో యాక్షన్ ను వదిలిపెట్టి తనకు అచ్చివచ్చే జోనర్ లోనే సినిమాలు తీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అనిల్ దర్శకత్వంలో నటించబోతున్నారు. గతంలో వీరిద్దరూ ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలకు కూడా దిల్ రాజే నిర్మాత.












Click it and Unblock the Notifications