‘ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'.. ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు, ప్రతి తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో పదిలంగా దాచుకున్న తీపి జ్ఞాపకాలు. ఆ సినిమాల్లోని వినోదం, పంచ్‌లు మన రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ మాటల రచయిత నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు, వెంకటేష్ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని సినీ అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ వచ్చిన చిత్రమే 'ఆదర్శ కుటుంబం'.

భారీ అంచనాల మధ్య అనౌన్స్ అయిన ఈ సినిమా, రిలీజ్ సమయానికి వచ్చేసరికి థియేటర్ల వద్ద కాస్త చల్లబడింది. పాటలు క్లిక్ కాకపోవడం, విడుదల తేదీలు వరుసగా వాయిదా పడటంతో ఆడియన్స్‌లో బజ్ తగ్గింది. మరి ఇన్ని అడ్డంకుల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ 'ఆదర్శ కుటుంబం' ప్రేక్షకులను ఏ మేర మెప్పించింది? వెంకీ-త్రివిక్రమ్ మార్క్ వినోదం మళ్లీ పండిందా? చూద్దాం.

'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!
'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!
Adarsha Kutumbam Movie Review Check out How Venkatesh trivikram srinivas Magic Worked

కథేంటంటే?

చిట్టిబాబు (వెంకటేష్) ఒక సాధారణ మధ్యతరగతి భర్త. చిన్న ఉద్యోగం, చిన్ని సంసారం, ఇద్దరు పిల్లలు. నెల గడవడమే కష్టంగా ఉండే ఆయన జీవితంలో చుట్టూ అప్పుల బాధలు, మరోవైపు కొడుకు ఆపరేషన్ కోసం అత్యవసరంగా డబ్బులు కావాల్సిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో ఉన్న ఉద్యోగం ఊడుతుంది. ఆ షాక్‌లో ఉన్న చిట్టిబాబుకు ఊహించని రీతిలో రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దాంతో ఒకే ఒక్క రోజులో ఆయన జీవితం మారిపోతుంది. విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కార్లు సొంతమవుతాయి. అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవదు. సంపన్న కుటుంబాలే లక్ష్యంగా ఇంట్లో పనివాళ్లుగా చేరి, అర్థరాత్రి దోపిడీలు చేస్తూ అడ్డొచ్చిన వారిని దారుణంగా చంపే ఒక అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా కన్ను చిట్టిబాబు కుటుంబంపై పడుతుంది. ఆ గ్యాంగ్ చిట్టిబాబు కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేసింది? వారి బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అనేది మిగతా కథ.

కేజీఎఫ్ రికార్డుకే ఎసరు పెట్టిన రూ.3 కోట్ల చిన్న సినిమా!
కేజీఎఫ్ రికార్డుకే ఎసరు పెట్టిన రూ.3 కోట్ల చిన్న సినిమా!

విశ్లేషణ

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే స్పానిష్ వెబ్ సిరీస్ 'బ్లాస్ట్'తో పోలికలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ ఆ ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ బ్యాంక్ మినహా ఎక్కడా ఆ సిరీస్ ఛాయలు కనిపించవు. 'బ్లాస్ట్' చూసిన వారికి ఇంటర్వెల్ బ్యాంగ్ కొంత సాధారణంగా అనిపించినా, మిగతా ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది. ఫస్టాఫ్ విషయంలో త్రివిక్రమ్ తన మార్క్ రైటింగ్, టైమింగ్‌తో పూర్తి విజయం సాధించారు. చిట్టిబాబు పాత్ర పరిచయం, ఆయన పడే అప్పుల తిప్పలను సరదాగా నడిపిస్తూనే, లాటరీ తగిలాక కథను మరో ట్రాక్‌లోకి తీసుకెళ్లారు.

సత్య, రఘుబాబు పాత్రల ఎంట్రీతో వినోదాన్ని పండించారు. ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రథమార్థాన్ని తీర్చిదిద్దారు. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల యాక్షన్, దొంగల ముఠా స్కెచ్‌లు కథను పరుగులు పెట్టించాయి. ఇక్కడ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ సీన్లను బాగా ఎలివేట్ చేశాయి. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కూడా సత్య ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫస్టాఫ్‌ను ఫన్‌గా ముగించడం త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్.

వేగం తగ్గిన రెండో భాగం

అయితే, ద్వితీయార్థం (సెకండాఫ్) లో మాత్రం ఆ వేగం తగ్గింది. ఆదర్శ కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ డ్రామా పెద్దగా పండలేదు. దొంగల ముఠా కూడా సైలెంట్ అయిపోవడంతో హీరో ఎదుర్కొనే రిస్క్ తగ్గింది. షాపింగ్ మాల్ యాక్షన్ సీన్ కూడా సోసోగానే సాగుతుంది. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించేసిన భావన కలుగుతుంది. సెకండాఫ్‌లో కూడా ఫస్టాఫ్ తరహాలోనే కామెడీ, కథనంలో బిగుతు ఉండి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయితే అనవసరమైన ల్యాగ్ లేకుండా నిడివి తక్కువగా ఉంచడం, ట్రోల్ అయిన 'మాలా వచ్చా చూడు' పాటను ఎడిటింగ్‌లో తీసేయడం సినిమాకు కలసిసొచ్చిన అంశం.

నటీనటులు & సాంకేతిక వర్గం:

వెంకటేష్ తన నటనతో మరోసారి వన్ మ్యాన్ షో చేశారు. "నేనేమైనా కమల్ హాసనా, మోహన్ లాలా.. ప్రతీ ఎక్స్‌ప్రెషన్ పలకడానికి" అంటూ ఆయన చెప్పిన సెల్ఫ్ డిప్రిసియేటింగ్ డైలాగ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. శ్రీనిధి శెట్టి హోమ్లీ లుక్‌లో మెప్పించగా, పిల్లల పాత్రలు ఆకట్టుకున్నాయి. నారా రోహిత్ తన పరిధి మేర డిసెంట్ నటన కనబరిచారు. కమెడియన్ సత్య తన టైమింగ్‌తో నవ్వులు పూయించగా, రావు రమేష్ చెప్పే ముగింపు డైలాగ్స్ (ముఖ్యంగా పుస్తకం డైలాగ్) బాగా గుర్తుండిపోతాయి. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటల్లో 'నారాయణమ్మ' పాట మినహా మిగిలినవి పెద్దగా గుర్తుండవు. కానీ, తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు.

ముగింపు:

మొత్తంగా చెప్పాలంటే.. 'ఆదర్శ కుటుంబం' చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి కల్ట్ క్లాసిక్ స్థాయిని అందుకోకపోవచ్చు. కానీ, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని అందించడంలో మాత్రం నిరాశపరచదు. రిలీజ్‌కు ముందు అంచనాలు తక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. సెకండాఫ్‌పై మరికాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఈ 'ఆదర్శ కుటుంబం' కలెక్షన్ల సునామీ సృష్టించి ఉండేది.

రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+