అల్లు అర్జున్ కొడుకు చేతులమీదుగా అల్లురామలింగయ్య విగ్రహావిష్కరణ..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని నవ్వుల తోటలో పూసిన పువ్వు అల్లు రామలింగయ్య.. అల్లు పేరు వింటేనే నవ్వులు పూస్తూనే ఉంటాయి. వెయ్యి సినిమాలకు పైగా నటించిన అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించారు. నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించారు అల్లు రామలింగయ్య..
నేడు ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ కొడుకు చేతులమీదుగా అల్లురామలింగయ్య విగ్రహావిష్కరణ చేశారు.
గతేడాది అల్లు రామలింగయ్య వందవ జయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోని ప్రారంభించారు. ఇప్పుడు అల్లు బిజినెస్ పార్క్‌లో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ మాట్లాడారు. అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు ఎప్పుడు మనతోనే ఉంటాయి. తాత గారి దీవెనలు ఎప్పుడూ మాపై ఉంటాయి అని అన్నాడు.

101 జయంతి : తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు నిర్మాత అల్లు అరవింద్. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ లో ఈ కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించారు. అయితే మనవడి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ, హీరో అల్లు శిరీష్, అల్లు అర్జున్ కూతురు అర్హతోపాటు వారి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూల మాల వేసి ఆయన్ని గుర్తు చేసుకున్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు : అందులో భాగంగానే కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. అల్లు రామలింగయ్య తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ హాజరుకాలేదు. ఆయనతోపాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా హాజరు కాకపోవడం గమనార్హం. అయితే బన్నీ ప్రస్తుతం పుష్ప2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప2లో నటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications