‘అమెచ్యూరిష్’ Vs ‘బాస్ తొక్కేస్తాడు’
1978లో వచ్చిన 'యుగపురుషుడు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన "మిస్టర్, మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్ గా ఉంది అనే డైలాగ్ ఇటీవల సోషల్ మీడియాలో మీమ్‌గా వైరల్ అయింది. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమాలో కమెడియన్ సత్య ఈ డైలాగ్‌ను పలికి ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేయడం నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. చిత్రబృందం కావాలనే సినిమా ప్రమోషన్ల కోసం ఈ మీమ్‌ను ప్రచారం చేసి, ఎన్టీఆర్ స్థాయిని కించపరిచిందని వారు ఆరోపించారు.

నందమూరి అభిమానుల ప్రతిదాడి
ఈ సీన్‌తో ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు ఎక్స్ వేదికగా మెగా ఫ్యామిలీపై దాడికి దిగారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో పలువురు యువ హీరోల కెరీర్లను తొక్కేశారంటూ వస్తున్న పాత ఆరోపణలను మళ్లీ తెరపైకి తెచ్చారు. #BossThokkestadu అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తూ, చిరంజీవితో పాటు ఇతర మెగా హీరోల తీరుపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ప్రారంభించారు.
చిత్రయూనిట్ క్లారిటీ, సర్దిచెప్పే ప్రయత్నం
వివాదం ముదరడంతో హీరో వరుణ్ తేజ్, నటుడు సత్య, నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తమకు ఎన్టీఆర్ గారంటే ఎంతో గౌరవమని, కేవలం హాస్యం కోసమే సత్య ఆ సీన్ చేశారని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. ఇతర సీనియర్ నటులను అనుకరించడం మన సినీ సంస్కృతిలో భాగమేనని, అభిమానులు ఈ విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలని కోరారు.
మెగా ఫ్యాన్స్ కౌంటర్
పాత వీడియోలతో చిత్రబృందం వివరణ ఇచ్చినా ట్రోలింగ్ తగ్గకపోవడంతో మెగా అభిమానులు కూడా రంగంలోకి దిగారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోని కొన్ని పాత డ్యాన్స్ మూమెంట్లు, డైలాగ్ డెలివరీలతో పాటు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సంబంధించిన వివాదాస్పద పాత వీడియోలు, ఆడియో క్లిప్పులను బయటకు తీసి షేర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.














Click it and Unblock the Notifications