ఆ యాంకర్ నాపై చేతబడి చేయించింది..
టాలీవుడ్ బుల్లితెర ప్రపంచంలో దశాబ్దానికి పైగా తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్నారు "యాంకర్ రవి". 'పటాస్', 'ఢీ జూనియర్స్' వంటి హిట్ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. తన కామెడీ టైమింగ్, స్పాంటేనియస్ మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం టీవీ షోలకే పరిమితం కాకుండా, అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇక ఆ క్రేజ్ తోనే Bigg Boss Telugu Season 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.
అయితే బిగ్ బాస్ లో టైటిల్ గెలవకపోయినా, తన ఆటతీరు, నిజాయితీగా మాట్లాడే స్వభావంతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. కానీ ఆ షో ద్వారా ఆయనకు ఇండస్ట్రీలోని అనుభవాలపై కొత్త అవగాహన వచ్చిందని వెల్లడించారు. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న రవి.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లు, వెన్నుపోట్లు గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తన 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఛానెల్స్‌లో పనిచేశానని.. ఎన్నో హిట్ ప్రోగ్రామ్స్ చేశానని అన్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ యాంకర్ తన ఎదుగుదలను చూసి అసూయతో చేతబడి చేయించిందని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో ఆయన చేసిన ఈ సంచలన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

రవి ఏమన్నారంటే..
తన కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో ఎదురైన అడ్డంకులు గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వెన్నుపోట్లు కామన్ అంటూ వ్యాఖ్యానించారు. మనుషుల మధ్యే అవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా తనతో కలిసి పనిచేసిన ఓ లేడీ యాంకర్ తన ఎదుగుదలను చూసి అసూయతో చేతబడి చేయించిందని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వ్యక్తితో తన మీద చేతబడి పూజలు చేయించారని అన్నారు.
అయితే ఆ విషయంలో కూడా తనకు ఎలాంటి ద్వేషం లేదని.. ఆమె మంచిగానే ఉండాలని దేవుడిని కోరుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో పోటీ గురించి చెబుతూ.. కొంతమంది యాంకర్లు తనతో షోలు చేయడానికి నిరాకరించిన సందర్భాలున్నాయని తెలిపారు. తాను అదృష్టాన్ని కాదు.. కష్టాన్ని నమ్ముతానని.. టాలెంట్ ఉంటే అవకాశాలు తప్పక వస్తాయని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో వచ్చిన విజయాలు కష్టానికి ఫలితమని.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పారు.












Click it and Unblock the Notifications