పవన్ కల్యాణ్ కు ఆ యోగం లేదు: వేణుస్వామి
రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు, సినీ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెబుతూ చివరకు తాను కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు వేణుస్వామి. వాస్తవానికి ఈయన చెప్పేవి జరుగుతాయా? లేదా? గతంలో ఏమైనా జరిగాయా? అనే విషయాలను పక్కనపెడితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకన్నా ఎక్కువ ప్రచారం మాత్రం పొందుతున్నాడని చెప్పొచ్చు. నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పదంగా మాట్లాడటం, వారి జాతకం అలా ఉంది.. వీరి జాతకం ఇలా ఉంది.. అని చెబుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.
అటువంటి వేణుస్వామి తాజాగా ఏపీ రాజకీయాలపై వీడియోను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేనాని పవన్ కల్యాణ్ మోసపోవడం ఖాయమన్నారు. పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని, తను ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించాడు. రానున్న ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని, వైఎస్ జగనే విజయం సాధిస్తాడన్నాడు. జాతకరీత్యా చంద్రబాబునాయుడిది పుష్యమి నక్షత్రమని, పవన్ కల్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రమని, ఈ రెండింటికీ పొత్తు కుదరదన్నారు. వీళ్ల జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదని, పవన్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని, జాతకం ప్రకారమే చెబుతున్నానన్నారు.

దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలుస్తాడని, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని, కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తాడని చెప్పావుగా.. అవన్నీ ఎందుకు జరగలేదంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వేణుస్వామిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని, కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ చెప్పావుగా.. ఇప్పుడేమైంది.. రేవంత్ రెడ్డి ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని, రాబోయే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటాడని, ఇకనైనా నీ సుత్తి జ్యోతిష్యాలు, పనికిమాలిన జ్యోతిష్యాలు మానుకోవాలని, వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతూ పాపులర్ అవడానికి ప్రయత్నిస్తే ప్రభాస్ అభిమానుల చేతిలో బడితపూజ జరిగిద్దని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications