బా బా బ్లాక్ షీప్ రివ్యూ: నవ్వులు పూయించే డిఫరెంట్ క్రైమ్ కామెడీ!
ఆలోచనల కంటే సెంటిమెంట్ చేసే మ్యాజిక్ ఆధారంగా తెరకెక్కిన డిఫరెంట్ క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్'. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆసాంతం మేఘాలయ అందాల నడుమ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కొన్ని చోట్ల సమర్ధత, ఆలోచన కంటే సెంటిమెంట్ ఎక్కువ పని చేస్తుంది..ఇది ఎవరూ కాదనలేని నిజం. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని యువ దర్శకుడు గుణి మంచి కంటి తయారు చేసుకున్న కథకు వేణు దోనేపూడి వంటి నిర్మాత సపోర్ట్ దొరకటంతో రూపొందిన సినిమాయే 'బా బా బ్లాక్ షీప్'. డిఫరెంట్ క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆసాంతం మేఘాలయాలోనే రూపొందటం విశేషం. మేఘాలయాలో ఎంటైర్ షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం కూడా ఇదే. మరి చిత్రాలయం స్టూడియోస్ రూపొందించిన 'బా బా బ్లాక్ షీప్' సినిమా ఎలా ఉంది? ప‌్రేక్షకులను ఆకట్టుకుందా..లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..

కథ
కొన్నిసార్లు సామర్థ్యం, ఆలోచనల కంటే 'సెంటిమెంట్' అనుకున్న పనిని సులభంగా పూర్తి చేస్తుంది. ఈ వైవిధ్యమైన ఆలోచనతో సాగే కథ ఇది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒక ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడానికి ఇద్దరు బిజినెస్ టైకూన్స్ పోటీపడతారు. అందులో ఒకరు ఆ ప్రాజెక్ట్‌ను నిర్ణయించే పెద్దాయనను సెంటిమెంట్‌తో ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం స్వాతంత్ర్య సమరకాలంలో కనిపించకుండా పోయిన ఒక విలువైన వస్తువును వెతికి తెచ్చి బహుమతిగా ఇవ్వడానికి తన అసిస్టెంట్ మూర్తి (శుభలేఖ సుధాకర్)తో కలిసి ప్లాన్ వేస్తాడు. ఆ బాధ్యతను గ్యాంగ్‌స్టర్ జాన్ (ఉపేంద్ర లిమాయె)కి అప్పగిస్తారు.
మరోవైపు, మేఘాలయలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) తన ప్రియురాలు మేరి (సమృద్ధి)ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ లోపు ఫ్రెండ్స్ అంతా కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుండగా పోలీసుల ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. సత్తిపండు, సందీప్ (అక్షయ్ లగుసాని)లు కారులో పారిపోతున్న క్రమంలో ప్రమాదానికి గురవుతారు. అక్కడ లభించిన ఒక రహస్యమైన బాక్స్‌ను సందీప్ తీసుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే... పెళ్లి మండపంలోకి గ్యాంగ్‌స్టర్ జాన్ ఎంటర్ అయ్యి, ఆ బాక్స్ తెచ్చిస్తేనే సత్తిపండును ప్రాణాలతో వదులుతానని హెచ్చరిస్తాడు. దాంతో సందీప్ తన ఫ్రెండ్ జాన్వీ (విస్మయ శ్రీ)తో కలిసి ఆ బాక్స్ కోసం ఎలాంటి సాహసాలు చేశాడు..? అసలు ఆ బాక్స్‌లో ఏముంది..? సత్తిపండు పెళ్లి సజావుగా జరిగిందా లేదా..? అనేదే ఈ 'బా బా బ్లాక్ షీప్' కథ.
విశ్లేషణ
దర్శకుడు గుణి మంచికంటి ఎంచుకున్న క్రైమ్ కామెడీ పాయింట్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. కథ టేకాఫ్ అయిన తీరు, ఆ తర్వాత వచ్చే మలుపులు, క్లైమాక్స్ వరకు రన్ అయ్యే సస్పెన్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.ఈ చిత్రానికి అతిపెద్ద విశేషం మేఘాలయ లోకేషన్లు. ఎంటైర్ షూటింగ్ మేఘాలయలోని ప్రకృతి అందాల నడుమ జరుపుకున్న తొలి దక్షిణ భారత చిత్రంగా ఇది నిలిచింది. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించినప్పటికీ స్క్రీన్ పై విజువల్స్ చాలా రిచ్‌గా మెప్పిస్తాయి. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ మేఘాలయ అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడో) అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. 'సమయమే ఇంద్రజాలం', 'వే వేల', 'అజా మేరి జాన్' పాటలు శ్రవణానందకరంగా ఉండి ఆకట్టుకుంటాయి.
నటీనటుల ప్రతిభ
అక్షయ్ లగుసాని తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డాన్సులతో అలరించాడు. కథను ముందుండి నడిపించే పాత్రలో చక్కటి నటన కనబరిచాడు.సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ తన మార్కు లుక్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాడు.'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్‌గా సీరియస్‌నెస్ , కామెడీని సమపాళ్లలో పండిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, పోలీస్ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్, అనీష్ కురువిల్లా తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.
హైలైట్స్
*క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ ,తదుపరి భాగానికి ఇచ్చిన లీడ్
*కథలో వర్కవుట్ అయిన పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్
*కంటికి ఇంపుగా ఉండే మేఘాలయ లోకేషన్లు ,కెమెరా వర్క్
*ప్లజెంట్ సాంగ్స్ , మెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఫైనల్‌గా
మంచి కథ, దానికి తోడు నవ్వించే కామెడీ, కన్నులవిందైన విజువల్స్ కోరుకునే ప్రేక్షకులకు 'బా బా బ్లాక్ షీప్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. వీకెండ్‌లో కుటుంబంతో, మిత్రులతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి చిత్రాలయం స్టూడియోస్ అందించిన ఈ ఎంటర్‌టైనింగ్ క్రైమ్ కామెడీని తప్పకుండా చూడవచ్చు.
*రేటింగ్:2.75/5














Click it and Unblock the Notifications
