సినిమాలో ఒక్క ఫైట్ లేకుండా, డ్యాన్స్ లేకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సినిమా వస్తోంది అంటే అందులో అద్భుతమైన పోరాట దృశ్యాలు ఉంటాయని అభిమానులతోపాటు సినీ ప్రియులంతా భావిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ప్రతి సినిమాలోను పోరాట దృశ్యాలుంటాయి. అవి చూసి అభిమానులు ఆనందపడుతుంటారు. ఇలా ఒక్క చేత్తో కొడితే కారులో నుంచి తలుపులు బద్దలు కొట్టుకుంటూ అరకిలోమీటరు దూరం వెళ్లి విలన్ అవతల పడుతుంటాడు. ఈలోగా కారు ఊగిపోతుంటుంది. ఇటువంటి సన్నివేశాలకు అలవాటుపడిన బాలయ్య నుంచి ఒక్క పోరాట సన్నివేశం లేకుండా సినిమా వచ్చిందంటే ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది.
పెద్ద సంచలనాన్ని కలిగించింది
బాలకృష్ణ, శోభన, నిరోష నాయకా నాయికలుగా, యువచిత్ర బ్యానరుపై కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.నరసింహనాయుడు ఈ సినిమాను నిర్మించారు. 1990 ఏప్రిల్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా బాలయ్యకు 50వ సినిమా. కోదండరామిరెడ్డి అంటే కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరుంది. అటువంటి దర్శకుడు, ఒక స్టార్, మాస్ హీరోతో కలిసి పోరాటాలు లేకుండా సినిమా తీయడయం అప్పట్లో పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఆ సినిమా ఏదో కాదు.. నారీ నారీ నడుమ మురారి. కమర్షియల్ సూత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఈ సినిమాను నిర్మించారు.

డైలాగులన్నీ సింపుల్
నారీనారీ నడుమ మురారి చిత్రంలో ఉన్న కుటుంబ సన్నివేశాలు, భావోద్వేగాలు, సెంటిమెంట్ హైలైట్ అయ్యాయి. బాలయ్య ఈ సినిమాతో సినీ ప్రియులందరినీ ఆకట్టుకున్నారు. చివరకు బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సినిమా మొత్తాన్ని తమిళనాడులోని బెల్లంచెర్రీ అనే ప్రాంతంలో తీశారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఒక పోరాట సన్నివేశం, ఒక డ్యాన్స్ స్టెప్ కూడా లేకుండా భారీ విజయాన్ని అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమను బాగా ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన రికార్డును సృష్టించిన ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, బాబుమోహన్, అంజలిదేవి, రమాప్రభ తదితరులు నటించారు. ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి.












Click it and Unblock the Notifications