నిన్ను అమ్మ కాపాడుకుంటుంది... భగవంత్ కేసరి 'బ్యాడ్ టచ్' పాఠం
పాపా.. నీకు వాడు చాక్లెట్ ఇచ్చి నీమీద చేతులేస్తుంటే అది తప్పని తెలియదా? అంటూ స్కూల్ యూనిఫాంలో ఉన్న 5 సంవత్సరాల చిన్నారిని భగవంత్ కేసరి అడుగుతాడు. అందుకు సమాధానంగా ఆ చిన్నారి ఊహూ అంటూ అమాయకంగా చెబుతుంది. (చాక్లెట్ తింటూనే సమాధానం చెబుతుంది). అలా వేయరానిచోట చెయ్యి వేస్తే తప్పని ఆ చిన్నారికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది. ఎవరు చెప్పాలి? ఇంట్లో అమ్మ చెప్పాలి.. లేదేంటే స్కూల్ లో టీచర్ చెప్పాలి. కానీ వారు చెప్పడంలేదు. చాలామందికి చెప్పాలని కూడా తెలియడంలేదు. కొందరికి చెప్పాలని ఉన్నా సంశయంతో ఆగిపోతున్నారు.
అభం శుభం తెలియని చిన్నపిల్లలపై మేకవన్నె పులుల్లాంటి కొందరు మానవ మృగాలు చేస్తున్న ఆకృత్యాల గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిగురించి తెలుసుకొని చిన్నారుల తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారేకానీ తమ బిడ్డకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నంకానీ, ధైర్యంకానీ చేయడంలేదు.ఆడబిడ్డల కోసం ఆ పని చేయడానికి అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ముందుకు కదిలాడు.

ఆపాపను ఎత్తుకొని నేరుగా వాళ్ల స్కూల్ కు వెళ్లాడు. అక్కడి టీచర్లు ఏనాడూ చెప్పని 'బ్యాడ్ టచ్' పాఠం పిల్లలందరికీ చెప్పాడు. అంటే సినిమా చూడటానికి వచ్చిన ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి చెప్పాడు. ఆటో డ్రైవర్, స్కూల్ లో ఫ్యూను, పక్కింటి అంకుల్, ఆఖరుకు ఇంట్లో తాతయ్య, అన్నయ్య అయినా సరే వేయరాని చోట చేయివేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పాలి.. అమ్మ మిమ్మల్ని కాపాడుకుంటుంది.
అలాగే అమ్మలకు కూడా కేసరి ఓ పాఠం చెప్పాడు. మా అడవిలో ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతుంటాయని బోర్డు పెడతారని, కానీ సమాజంలో మాత్రం మానవ మృగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎక్కడా ఎలాంటి బోర్డులూ ఉండవని, అమ్మలే తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పాలన్నాడు. ఇవి విన్నతర్వాతైన అమ్మలు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.
ఓ కమర్షియల్ సినిమాలో.. అందులోను ఓ అగ్ర హీరో సినిమాలో ఇటువంటి అంశాన్ని టచ్ చేయడం అభినందనీయమంటున్నారు. దీనిద్వారా ఓ అవసరమైన మార్పులనకు దర్శకుడు అనిల్ రావిపూడి నాంది పలికాడు. సినిమాలద్వారా ఇలాంటి అంశాలు చర్చిస్తే ఎక్కువమందికి చేరే అవకాశముంటుంది. దీనిపై ఆన్ లైన్ లో పెద్ద స్థాయిలో జరుగుతున్న చర్చే నిదర్శనం.












Click it and Unblock the Notifications