బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్: ఎందుకంటే?
తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ శేఖర్ బాషాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. శేఖర్ బాషా పలు యూట్యూబ్ ఛానల్స్‌లో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శేఖర్ భాషాను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.
కాగా, ఇటీవల కాలంలో శేఖర్ బాషా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తెలుగు యువ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలోనూ కలగజేసుకుని.. ఏకంగా స్టూడియోలో లైవ్ జరుగుతున్న సమయంలోనే దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ హర్షసాయి బాధితురాలి వివాదంలో శేఖర్ బాషా చిక్కుకున్నాడు.

గతంలో యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్థికంగా మోసం చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేగాక, హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసిననాటి నుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్షసాయి విదేశాలకు వెళ్లాడనే తెలియడంతో అతని కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడిదే కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications