ఆ యాడ్ కారణంగా తిప్పల్లో పడ్డ బాలీవుడ్ స్టార్ హీరోలు..
చిత్ర పరిశ్రమలోని నటీనటులు పలు యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అటు సినిమాలు చేస్తూనే తమ బ్రాండ్ వాల్యూతో పలు ఉత్పత్తులను సైతం ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ముందు ఉంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సహా పలువురు నటులు యాడ్ లలో కనిపిస్తున్నారు. ఇక అలానే బాలీవుడ్ లో సైతం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నుంచి యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ వరకు పలు అడ్వర్టైజ్మెంట్ లలో సందడి చేస్తూనే ఉంటారు.
హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా యాడ్ లలో కనిపించే వారిలో అమితాబ్ తర్వాత షారూఖ్ ఖాన్, అజయ్ దేవ్ గన్ లతో పాటు పలువురు యంగ్ హీరోలు ఉన్నారు. కొంత మంది హీరోలు ఆరోగ్యానికి హానికరమైనటువంటి వాటి యాడ్స్‌కి ధూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ఓ యాడ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. అందుకు కారణం వారు ప్రమోట్ చేసిన పాన్ మసాలా యాడ్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి జైపూర్‌లోని వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆ యాడ్ లో.. ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని హీరోలు ప్రమోట్ చేస్తున్నారని జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటన ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ యాడ్ లో 'దానె దానె మే కెసర్ కా దమ్' అనే ట్యాగ్‌లైన్ వాడారని గుర్తు చేశారు. కానీ వారు చెప్పినట్లు ఆ ఉత్పత్తిలో అసలు కేశర్ కలిపి లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కోర్టు హీరోలతో పాటు విమల్ పాన్ మసాలా తయారు చేసే JB ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్ కుమార్ అగర్వాల్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.
మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే వారు లేకుండానే విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రకటనలు చూసి సామాన్య ప్రజలు పాన్ మసాలాను విపరీతంగా తింటున్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇది ఆరోగ్యానికి హానికరమని.. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో జేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోందంటూ యోగేంద్ర సింగ్ ఫైర్ అయ్యారు.
మార్కెట్లో కుంకుమ పువ్వు ధర కిలోకు రూ.4 లక్షలు, పాన్ మసాలా ధర కేవలం రూ.5 మాత్రమేనని.. అలాంటిది పాన్ మసాలాలో కుంకుమ పువ్వును ఎలా కలుపుతారంటూ ప్రశ్నించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, సాధారణ ప్రజలను మోసం చేసినందుకు ఉత్పత్తి సంస్థ, ప్రకటనల్లో పాల్గొన్న నటులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. ఈ ప్రొడెక్ట్‌ను ఉత్పిత్తి చేస్తున్న సంస్థకు భారీ జరిమానా విధించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాన్ మసాలాను నిషేధించాలన్నారు.












Click it and Unblock the Notifications