పూకీ.. టైటిల్‌కు తగ్గట్లే సినిమా కూడా!
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ నిర్మాణంలో తమిళంలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలైన 'పూకీ' చిత్రం, ఇప్పుడు తెలుగులో 'బుకీ' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
కైలాష్ (అజయ్ ధీషన్), ఆశా (ఆర్.కె. ధనుష) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే జంట. దాదాపు ఆరేళ్లుగా వీరి ప్రేమాయణం సాఫీగా సాగిపోతుంటుంది. అయితే, ఒకానొక సందర్భంలో రోడ్డుపై జరిగిన ఒక చిన్న గొడవ (రోడ్ రేజ్) వీరిద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. ఆ గొడవ కాస్తా ముదిరి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకునే వరకు వెళ్తుంది. ఆరేళ్ల అనుబంధాన్ని తెంచుకుని విడిపోయిన తర్వాత, ఆ విరహ వేదన నుంచి బయటపడటానికి వారు ఏం చేశారు? మళ్లీ కలుసుకోవడానికి వారు పడ్డ సంఘర్షణ ఏంటి? అనే అంశాలను దర్శకుడు తెరపై చూపించే ప్రయత్నం చేశారు.

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన బలం హీరోయిన్ ఆర్.కె. ధనుష. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచింది. తన కళ్లతోనే భావాలను పలికించి ఆకట్టుకుంది. హీరో అజయ్ ధీషన్ తన పాత్రకు న్యాయం చేశాడు, ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విజయ్ ఆంటోనీ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని పాటలు మెలోడీగా ఉండి వినడానికి ఇంపుగా ఉన్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని భావోద్వేగాలను ఎలివేట్ చేయడంలో తోడ్పడింది.
మైనస్ పాయింట్స్:
సినిమాలో ప్రధాన లోపం కథాబలం లేకపోవడం. బ్రేకప్ తర్వాత లీడ్ పెయిర్ పడే బాధను చూపించే క్రమంలో వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్‌గా, సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి భాగంలో కథ అసలు ముందుకు కదలదు. నేటి తరం రిలేషన్ షిప్స్ గురించి చెప్పాలనుకున్నప్పటికీ.. ప్రేక్షకుడికి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ సరిగ్గా కలగదు. సెకండాఫ్ మొదటి భాగం కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ వరకు వెళ్లే సరికి ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సునీల్, మంచు లక్ష్మి వంటి నటులు ఉన్నా, వారి పాత్రలు కథకు పెద్దగా ఉపయోగపడవు.
సాంకేతిక పనితీరు
సాంకేతిక పరంగా చూస్తే, గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు. అయితే దర్శకుడిగా ఆయన విఫలమయ్యారని చెప్పాలి. ఒక సగటు ప్రేమకథను పట్టుకుని దానికి బలమైన స్క్రీన్‌ప్లే రాయడంలో ఆయన తడబడ్డారు. విజయ్ ఆంటోనీ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పర్వాలేదనిపిస్తాయి.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే.. 'బుకీ' ఒక రొటీన్, నీరసమైన రొమాంటిక్ డ్రామా. హీరో హీరోయిన్ల నటన, ఒకటి రెండు పాటలు మినహా, సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. బలహీనమైన కథనం, సాగదీసిన సన్నివేశాల వల్ల ఈ సినిమా యూత్‌కు కూడా పెద్దగా నచ్చకపోవచ్చు.
రేటింగ్: 2/5












Click it and Unblock the Notifications