అమ్మాయిలు మిస్సింగ్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న వెబ్‌సిరీస్
ఈ మధ్య కాలంలో ఎంతటి సూపర్ స్టార్ సినిమా అయినా సరే థియేటర్లలో మహా అయితే ఒక వారం లేదా 10 రోజులు మాత్రమే ఆడుతుంది. అంతకుముందు 100రోజులు లేదా ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఓటీటీ పుణ్యామాని థియేటర్లకు ప్రేక్షకులు కరువయ్యారు. ఒక్క ఫ్యాన్ షోకు మాత్రమే సినిమా హాళ్లు నిండిపోతున్నాయి. ఆ తర్వాత జనాలు పెద్దగా కనిపించడం లేదు. లేదా ఎలాగు ఒక రెండు వారాలు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అన్న ధీమాతో థియేటర్ ముఖమే చూడటం మానేశారు. పైగా డబ్బులు కూడా ఆదా అవుతాయన్న ఫీలింగ్‌లో ఉన్నారు.
దుమ్మురేపుతోన్న వెబ్‌సిరీస్
ఇదంతా అలా ఉంచితే.. ఓటీటీలో కొన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు దుమ్ము రేపుతున్నాయి. మంచి ఐడీఎంబీ రేటింగ్స్‌తో దూసుకెళుతున్నాయి.దీంతో ఓటీటీ ప్లాట్‌ఫారంలు కుప్పలు కుప్పలుగా వచ్చి మొబైల్ యాప్‌స్టోర్‌లో వచ్చి చేరుతున్నాయి.ప్రతి జానర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. క్రైమ్, సస్పెన్స్,రొమాంటిక్,డ్రామా, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇలా అన్ని కేటగిరీలో సినిమాలు,వెబ్‌సిరీస్‌లు ఓటీటీపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతూ సెన్సేషనల్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్‌లు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నాయి. అలాంటి వెబ్‌సిరీసే కానిస్టేబుల్ కనకం.

వివాదంతో మొదలు..
కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్‌కు ఆది నుంచి వివాదాలే. ఇటీవల ఓ పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారం పై కాపీ ఆరోపణలు రావడంతో ఈటీవీ విన్ ఓటీటీపై కానిస్టేబుల్ కనం వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడారని డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల చేసిన ఆరోపణలతో ఈ వెబ్ సిరీస్‌పై ఆడియన్స్ దృష్టి పడింది. 'ఒరిజినల్లీ మేడ్' అనే ట్యాగ్‌లైన్‌తో టీమ్ ప్రమోషన్ మొదలు పెట్టడంతో ఈ వివాదం మరింత రసవత్తరంగా మారింది.అయితే, ఈ హడావుడి మొత్తం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒకసారి చూద్దాం.
స్టోరీ లైన్:
ఈ సిరీస్ శ్రీకాకుళంలోని రేపల్లె గ్రామంలో 1990ల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలో 'అడవి గుట్ట' అనే ఒక భయంకరమైన ప్రదేశం ఉంటుంది. ఆ అడవిలోకి వెళ్లిన ఆడవాళ్లు మాయమైపోతుంటారు. దీంతో గ్రామస్థులు అక్కడికి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధిస్తారు. ఈ క్రమంలోనే కనక మహాలక్ష్మి అలియాస్ కనకం (వర్ష బొల్లమ్మ) రేపల్లె పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా జాయిన్ అవుతుంది
ఒక రోజు, కనకం స్నేహితురాలు చంద్రిక (మేఘా లేఖ) అదృశ్యమవుతుంది. దీనికి పరోక్షంగా కనకం కూడా బాధ్యురాలు అవుతుంది. ఇంతకీ చంద్రికకు ఏం జరిగింది? తప్పిపోయిన మహిళలంతా ఎక్కడికి వెళ్లారు? కనకం ఈ మిస్టరీని ఛేదించిందా? అనేదే ఈ సిరీస్ కథాంశం.
ప్లస్ పాయింట్స్:
వర్ష బొల్లమ్మ నటన: వర్ష బొల్లమ్మ పెర్ఫార్మెన్స్ ఈ షోకి మెయిన్ హైలైట్. భయంతో వణికిపోయే ఒక కానిస్టేబుల్‌గా ఆమె నటన ఆకట్టుకుంటుంది. తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ, చివరకు ధైర్యం చేసి లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమె చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది.
1990ల నాటి నేపథ్యం: ఆ కాలంలో ఉన్న లింగ వివక్షను ఈ సిరీస్ చక్కగా చూపించే ప్రయత్నం చేసింది.
క్యారెక్టర్స్: కథను చక్కగా మొదలుపెట్టి, ప్రతి పాత్రను నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. కనకం, ఆమె స్నేహితురాలు చంద్రిక మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ కథకు బలంగా నిలిచింది.
విలన్ క్యారెక్టర్: విలన్ పాత్ర డిఫరెంట్‌గా ఉండటం సిరీస్‌కు ప్లస్ అయ్యింది. ఫైనల్ ఎపిసోడ్‌లో విలన్ మోటివ్, నేరాలను చేసిన విధానం ఆసక్తికరంగా చిత్రీకరించారు.
ఇతర నటీనటులు: రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సిరీస్‌లో మైనస్ పాయింట్స్ వెతకడం చాలా కష్టమైన పనే. అయితే కథ ఢిల్లీకి మారినప్పుడు కథనంలో కాస్త వేగం తగ్గినట్లనిపించింది. హీరోయిన్ స్నేహితురాలు మిస్ అయిన తర్వాత కూడా కథనంలో ప్రేక్షకుడిని ఇంకాస్త టెన్షన్ గురిచేసేలా దర్శకుడు ప్రయత్నం చేసి ఉండొచ్చనిపించింది.
టెక్నికల్ అంశాలు:
టెక్నికల్‌గా ఇది బాగా తీసిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ప్రాణం పోసింది. రచనాపరంగా కొద్దిపాటి లోపాలు ఉన్నా.. బీజీఎం ఆ సన్నివేశాలను నిలబెట్టేసింది. శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ, విష్ణువర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ రన్‌టైమ్ 180 నిమిషాలు. డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల తాను చేపట్టిన ప్రాజెక్టుకు న్యాయం చేశారనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే, ఇన్వెస్టిగేషన్‌తో కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు.
చివరిగా:
మొత్తానికి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ప్రేక్షకుడు చూస్తున్నంత సేపు సీటుకు కట్టిపడేస్తుంది.కథ, స్క్రీన్ ప్లే, బీజీఎం, వర్ష బొల్లమ్మ నటన, విలన్ పాత్ర చిత్రణ, మంచి టెక్నికల్ అంశాలు ఈ సిరీస్‌కు ప్రాణం పోశాయి. ఇక రెండో సీజన్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీని డైరెక్టర్ ప్రశాంత్ క్రియేట్ చేశారు.












Click it and Unblock the Notifications