అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యమే మహిళ ప్రాణాలు తీసింది?
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం డిసెంబరు 5వ తేదీన విడుదలైంది. ఈ సందర్భంగా నాలుగోతేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. ఈ థియేటర్ ఒక్కటే కాకుండా చాలా థియేటర్లలో బెనిఫిట్ షో వేశారు. అయితే సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూడటానికి అల్లు అర్జున్ తోపాటు పుష్ప2 చిత్ర బృందం కూడా వచ్చింది. ఈ టీంలో అస్టిస్టెంట్ కెమెరామెన్ తో సహా 12 మంది వచ్చారు. అల్లు అర్జున్ అంటే ఆయనతోపాటు ఆయన మందీమార్బలం కూడా ఉంటుంది. బన్నీ అక్కడకు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి అభిమానులు తోసుకురావడంతో తొక్కిసలాటతో దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి (35) అనే మహిళ మృతిచెందింది. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు శ్రీతేజ్ కు వెంటనే సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అభిమానులను ఎడాపెడా నెట్టేసిన అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది
దీనిపై చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు పుష్ప2 టీం మొత్తంపై ఈ కేసు నమోదైంది. సెలబ్రిటీ అయివుండి బాధ్యతారాహిత్యం వ్యవహరించడం, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ కు రావడం, అల్లు అర్జున్ టీం ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. థియేటర్ దగ్గర ఉన్న పోలీసు ఇన్ ఛార్జి అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి వివరాలు రూపొందించినట్లు చిక్కడపల్లి సీఐ వెల్లడించారు. . సెక్షన్ 105, 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద అల్లు అర్జున్ తోపాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, సంధ్య థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్ పై కూడా కేసులు నమోదయ్యాయి. థియేటర్ ను మూసేయడానికి పోలీసులు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. తోపులాట జరుగుతున్న తరుణంలో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు, థియేటర్ భద్రతా సిబ్బంది కూడా అభిమానులను ఎడాపెడా నెట్టేశారు.

ముందుస్తు సమాచారం ఇవ్వలేదు
పోలీసులకు పుష్ప2 టీం వస్తున్నట్లు ముందస్తుగా సమాచారం ఇచ్చివుంటే తగిన భద్రతా ఏర్పాట్లు చేసేవారిమని, అలా కాకుండా సర్ ప్రైజ్ చేసేవిధంగా రావడం ఒక తప్పైతే, అభిమానులు తోపులాటకు దిగడానికి కారణమవడం మరో కారణమని పోలీసులు చెప్పారు. ఉన్నతాధికరుల నుంచి వచ్చి ఆదేశాల మేరకే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళ మృతి చెందిన విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, పరిశీలిస్తుందని తెలిపారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తోపులాటకు, పోలీసులకు ఎటువంటి సంబంధం లేకపోయినా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను కూడా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్ తో సహా పుష్ప2 టీం మొత్తంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications