దిల్ రాజు పెద్ద మనసు: బలగం వేణుతో..
Dil Raju: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లభించింది. ఏపీ నుంచి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు లభించింది.
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో వేలు ఆనందాచారి, కుర్రెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప ఉన్నారు. త్వరలోనే వారంతా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరిస్తారు.

పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను సత్కరించింది బలగం టీమ్. గత ఏడాది విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో దాసరి కొండప్ప ఓ చిన్న పాత్రలో నటించారు. అయ్యో శివుడా అనే పాటనూ పాడారు.
తమ సినిమాలో నటించిన దాసరి కొండప్పకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు లభించిన ఆనందాన్ని బలగం టీమ్ పంచుకుంది. శాలువ కప్పి సన్మానించింది. ఈ ఉదయం హైదరాబాద్‌లో దిల్ రాజు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కొద్దిమంది ఆహ్వానితులు ఇందులో పాల్గొన్నారు.
బలగం దర్శకుడు కమేడియన్ వేణు, కొందరు నటులు, దాసరి కొండప్ప కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా- దిల్ రాజు లక్ష రూపాయల మొత్తంతో కూడిన చెక్‌ను దాసరి కొండప్పకు అందజేశారు.












Click it and Unblock the Notifications