ప్లీజ్.. మరో విజయ్ కావొద్దు ధనుష్.. సాయిపల్లవి రిక్వెస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగు ప్రచారం జరుగుతోంది. తాజాగా తన కొత్త సినిమా 'ఓం: చాప్టర్ 1' ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా నటి సాయి పల్లవి ఈ చర్చలకు మరింత ఆజ్యం పోశారు. అంతే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ లాగా రాజకీయాల కోసం సినిమాలను వదిలేయవద్దంటూ ధనుష్‌కు సాయిపల్లవి రిక్వెస్ట్ చేశారు.
'నాలోని కళాకారిణి అదే కోరుకుంటోంది'
ఇటీవల జరిగిన 'ఓం: చాప్టర్ 1' ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్, సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. 'రామాయణం'లో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికను సమర్థిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అనంతరం మైక్ అందుకున్న సాయి పల్లవి మాట్లాడుతూ.. 'నేను ఈ వేడుకకు వస్తున్నప్పుడు దారి పొడవునా చాలా రాజకీయా జెండాలు కనిపించాయి. ఏదో రాజకీయ సభకు వస్తున్నానా అన్నంత సందడి నెలకొంది' అని చమత్కరించారు.

ఆ తర్వాత విజయ్ ప్రస్తావన తెస్తూ.. "మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. కానీ నాలోని ఓ కళాకారిణి మాత్రం ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తుంటుంది. విజయ్ సర్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. కనీసం ధనుష్ అయినా నటనను కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను" అని సాయిపల్లవి అన్నారు.
ధనుష్ లాంటి నిజమైన నటుడు ఇండస్ట్రీకి అవసరం
నటుడిగా ధనుష్ సినిమాల ఆవశ్యకతను వివరిస్తూ.. "ధనుష్ నటన, ఆయన ఎంచుకునే వాస్తవిక కథలు ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతాయి. 'పొల్లాదవన్' సినిమా తర్వాత ఎంతో మంది యువకులు అలాంటి బైక్ కొనుక్కుని.. ఆయన స్టైల్‌ను అనుకరించారు. ప్రజలపై అంతటి ప్రభావం చూపాలంటే ఓ నిజమైన కళాకారుడి వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఏ దారిని ఎంచుకున్నా, దయచేసి నటించడం మాత్రం ఆపకండి. లేదంటే మనందరం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోతాం" అని సాయి పల్లవి కోరారు.
ధనుష్ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
గత కొన్ని నెలలుగా ధనుష్ రాజకీయ అరంగేట్రంపై కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. "ధనుష్ కొత్త పార్టీ పెడితే మంచిదే, పెట్టకపోయినా పర్వాలేదు" అని కామెంట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. ఆ తర్వాత ఓ రక్తదాన శిబిరంలో ధనుష్ చేసిన ప్రసంగం కూడా రాజకీయ సంకేతాలు ఇచ్చింది. అయితే తనకు బీజేపీ మద్దతు ఉందంటూ వచ్చిన వార్తలను ధనుష్ కొట్టిపారేశారు. తనకు దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
"#Vijay sir has just entered politics and quit acting" — Sai Pallavi Non-stop roar, Even the anchor couldn't control the crowd 🤯💥 https://t.co/h6PT98gnr8
— Ayyappan (@Ayyappan_1504) November 15, 2026
నవంబర్ 20న 'ఓం: చాప్టర్ 1'విడుదల
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఓం: చాప్టర్ 1'లో ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, శ్రీలీల, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. తిరువణ్ణామలై అడవుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన 20 మంది తమిళ కలప కార్మికులను కాపాడే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో సాయి పల్లవి 'ఆపరేషన్ మోల్' బాధ్యతలు చేపట్టి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే ఏ ఎస్పీ నిత్యా రెడ్డి అనే పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 20న పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.














Click it and Unblock the Notifications
