'ధురందర్'కు పాక్ సమాధానం?
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న 'ల్యారీ' ప్రాంతం ఇప్పుడు ఇరు దేశాల మధ్య సినిమా చర్చలకు వేదికైంది. గతేడాది విడుదలైన భారతీయ బ్లాక్ బస్టర్ సినిమా 'ధురందర్' ఈ ప్రాంతాన్ని నేరాలకు, గ్యాంగ్ వార్లకు అడ్డాగా ప్రపంచానికి వెండితెర వేదికగా పరిచయం చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సృష్టించిన నెగటివ్ ఇమేజ్‌ను చెరిపేసేందుకు పాకిస్థాన్ ఇప్పుడు 'మేరా ల్యారీ' అనే కొత్త సినిమాతో సిద్ధమైంది. మే 8న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం ఓ సినిమా మాత్రమే కాదు.. ల్యారీ ప్రాంతంపై ఉన్న ముద్రను మార్చే ప్రయత్నమని అక్కడి వారు భావిస్తున్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్' ఓ స్పై థ్రిల్లర్. ఇందులో హీరో రణవీర్ సింగ్ ఓ భారతీయ గూఢచారిగా నటించారు. 2005 నుంచి 2022 వరకు ల్యారీ ప్రాంతంలో ఉన్న రెహమాన్ బలూచ్ గ్యాంగ్, అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలను ఈ సినిమా కళ్లకు కట్టింది. అజిత్ ధోవల్, నవాజ్ షరీఫ్ వంటి ప్రముఖుల స్ఫూర్తితో రూపొందించిన పాత్రలు, అలాగే నిజ జీవిత గ్యాంగ్‌స్టర్ల కథలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ల్యారీ ప్రాంతాన్ని కేవలం హింసకు కేంద్రంగా చూపడాన్ని పాక్ సినీ వర్గాలు ప్రచార చిత్రంగా కొట్టిపారేశాయి.

దీనికి సమాధానంగా వస్తున్న 'మేరా ల్యారీ' సినిమా నేరాల ప్రపంచాన్ని కాకుండా క్రీడల నేపథ్యంలో సాగుతుంది. అబూ అలీహా దర్శకత్వం వహించిన ఈ 'స్పోర్ట్స్ డ్రామా' ల్యారీకి చెందిన మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణుల కథను చూపిస్తుంది. ప్రముఖ నటి ఆయేషా ఉమర్ ఇందులో కోచ్‌గా నటించారు. గృహ హింస, తీవ్ర గాయాల బారిన పడిన ఒక కోచ్, తిరిగి తన ప్రాంతానికి వచ్చి అక్కడి అమ్మాయిలకు ఫుట్‌బాల్ నేర్పించి వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపారన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులను కూడా ఇందులో భాగం చేయడం విశేషం.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు 'మేరా ల్యారీ' ప్రీమియర్ షోను 'యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత మే 8న పాకిస్థాన్ అంతటా ఈ సినిమా విడుదల కానుంది. ల్యారీ ప్రాంతం అంటే గ్యాంగ్‌స్టర్లు మాత్రమే కాదు.. అక్కడ ప్రతిభావంతులైన క్రీడాకారులు కూడా ఉన్నారని నిరూపించేందుకు ఈ చిత్రం ప్రయత్నిస్తోంది. 'ధురందర్' ద్వారా ఏర్పడిన అభిప్రాయాన్ని ఈ స్పోర్ట్స్ డ్రామా ఎంతవరకు మారుస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల పోలిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications