నిండా మునిగిన తర్వాత చలేందబ్బా?
తన స్నేహితుడు పవన్ కల్యాణ్ కోసం దర్శకుడు, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంటున్నారా? అంటే దీనికి ఫిల్మ్ నగర్ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమా ఫ్లాపవడంతో త్రివిక్రమ్ మీద దారుణమైన విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్రారంభమయ్యే సమయానికే ఆయన పవన్ కల్యాణ్ చేసే చిత్రాల కోసం కథలను వినడం, దర్శకులను సెట్ చేయడంలాంటి పనులు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకటి రెండు సినిమాలకు మాటలను కూడా అందించారు. అందుకోసం ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నారనే సంగతి కూడా తెలిసిందే.
గుంటూరు కారం సమయానికి కూడా పవన్ కోసం సినిమాలను సెట్ చేసే పనిలో ఉండి ఈ సినిమాపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్లు గుంటూరు కారం ఫ్లాపవడానికి కూడా అన్నే కారణాలున్నాయి. చివరకు ఎలాగోలా చాప చుట్టేసినట్లు చుట్టేసి విడుదల చేశారు. మొదటి నుంచి దీనిపై మహేష్ అభిమానులకు ఆశల్లేవు. అందుకనుగుణంగా నే సినిమా కూడా ఫ్లాపైందికానీ మహేష్ నటనకు, డ్యాన్స్ కు మంచి పేరు వచ్చింది. ప్రిన్స్ ఇమేజ్ మీద కొట్టుకొచ్చింది. దాదాపు రూ.230 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

మరోసారి కూడా అదే తప్పును త్రివిక్రమ్ పునరావృతం చేస్తున్నారంటున్నారు. పవన్-అట్లీ సినిమాను సెట్ చేయడంతోపాటు మరో దర్శకుడి కాంబినేషన్ లో కూడా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఎన్నికల ప్రసంగాలను పవన్ కోసం సిద్ధం చేయాలి. తాను దర్శకుడిగా గుంటూరు కారం తర్వాత ఏ సినిమా చేయాలన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే పవన్ కల్యాణ్ తన స్నేహితుడు కాబట్టి, స్నేహం కోసం కెరీర్ ను కూడా రిస్క్ లో పడేసుకుంటున్న త్రివిక్రమ్ ను పవన్ అభిమానులతోపాటు కొందరు నెటిజన్లు కూడా కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications