జగన్‌గా జీవా జీవించాడు..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ యాత్ర అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.
వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో అనసూయ.. కీలక పాత్రల్లో నటించారు. 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌కు ఎదురైన అనుభవాలే ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఆ అనుభవాల ఆధారంగానే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయ విద్యుత్ ఛార్జీల మాఫీ, పింఛన్ మొత్తం పెంపుదల, డ్వాక్రా మహిళలకు పావల వడ్డీతో రుణాల విడుదల.. వంటి చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలకు బీజాలు వేశాయి.
ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. షూటింగ్ మొదలైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.
ఇటీవలే కడప జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరులల్లో పాదయాత్ర, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు. యాత్ర 2 విడుదల తేదీ కూడా ఇటీవలే బయటికొచ్చిన విషయం తెలిసిందే. 2019లో యాత్ర ఏ తేదీన విడుదలైందో.. 2024లో అదే తేదీ నాడే యాత్ర 2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదల కాగా.. 2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మహీ వీ రాఘవ్. వైఎస్ జగన్ పాత్రను పోషిస్తోన్న జీవా జనం మధ్యలో ఉన్న లుక్స్ అవి. జగన్ క్యారెక్టర్‌లో జీవా జీవించాడని, దాన్ని తాను ప్రత్యక్షంగా చూశానంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు మహీ వీ రాఘవ్. ఫిబ్రవరి 8వ తేదీన విడుదల తరువాత ప్రతి ఒక్కరూ తనతో ఏకీభవిస్తారని చెప్పారు.
2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతో కొంత దోహదపడిందని చెబుతుంటారు. ఇప్పుడు 2024లో అదే తేదీకి యాత్ర 2 కూడా తెరమీదికి రాబోతోండటం- ఆ తరువాత జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడానికి సహాయ పడుతుందనే అంచనాలు సైతం లేకపోలేదు.












Click it and Unblock the Notifications