4 ఏళ్లలో 750 ఇంజెక్షన్లు.. దయనీయ స్థితిలో ఒకప్పటి స్టార్ విలన్
Actor Ponnambalam: విలన్ పాత్రలతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుపరిచితులైన నటుడు పొన్నంబళం ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆయనకు మద్యం వ్యసనంగా కారణంగా రెండు కిడ్నీలు పాడై, ప్రస్తుతం నిరంతరం డయాలసిస్ చేయించుకుంటూ దీనమైన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఈ నటుడి పరిస్థితి ఇప్పుడు హృదయ విదారకంగా మారింది.
పొన్నంబళం కెరీర్ ప్రస్థానం
పొన్నంబళం కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాలేదు. ఆయన తెలుగులోనూ , మలయాళంలోనూ, అలాగే హిందీలోనూ పలు చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. 1988లో ప్రభు నటించిన 'కలియుగం' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 'అపూర్వ సహదరంగాళ్', 'వెట్రి విళా', 'మిచెల్ మదన్ కామరాజన్', 'మననగర్ కవల్' వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, తన విలక్షణ నటనతో వారి మన్ననలు పొందారు. తెలుగులో 1992లో ఘరానా మొగుడు, 1993లో అల్లరి ప్రియుడు, మెకానిక్ అల్లుడు వంటి చిత్రాలతో పాటు అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ నటుల సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పొన్నంబళం విలన్ పాత్రలకే కాకుండా స్టంట్ మ్యాన్‌గా కూడా తనదైన శైలిని ప్రదర్శించారు. ఆయన స్టంట్స్‌లో ఎంతగా నిష్ణాతులంటే, స్టంట్స్ చేసేటప్పుడు ఆయనకు ఎటువంటి గాయాలు లేదా ఫ్రాక్చర్లు కాలేదట. అందుకే ఆయనను చిత్ర పరిశ్రమలో ముద్దుగా "స్పేర్ పార్ట్స్" అని పిలిచేవారు. ఇది ఆయన పని పట్ల ఉన్న నిబద్ధతను, నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
పొన్నంబళం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి
పొన్నంబళం చివరిసారిగా 2022 విడుదలైన 'కాటేరి' చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన కెమెరా ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఆయన ఒక తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నారు. మద్యం వ్యసనం కారణంగా ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ప్రస్తుతం ఆయన డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. ఈ చికిత్స కోసం ఇప్పటికే 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పొన్నంబళం స్వయంగా వెల్లడించారు.
తన అనారోగ్యం, చికిత్స గురించి పొన్నంబళం మాట్లాడుతూ, "నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా చికిత్స కోసం శరత్‌కుమార్ ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత మరికొందరు కూడా సహాయం చేశారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు నటుడు ధనుష్ నాకు అండగా నిలిచారు. ఇంట్లో ఏదైనా సంకటం వచ్చినప్పుడు నటుడు అర్జున్ కూడా నాకు సహాయం అందించారు. వైద్యులు నాకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే జీవించే అవకాశం ఉందని చెప్పారు. డయాలసిస్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష." అని ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను ఒక రోజు విడిచి ఒక రోజు ఇంజెక్షన్ తీసుకోవలసి వస్తుంది. నాలుగు సంవత్సరాలుగా నేను ఒకే చోట 750 ఇంజెక్షన్లు తీసుకున్నాను. ఇది చాలా కష్టం. నేను ఉప్పు ఉన్న ఆహారం తినలేను. కడుపు నిండా తినలేను. ఈ పరిస్థితి నా శత్రువులకు కూడా రాకూడదు. నా వివాహం జరిగి 25 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటివరకు నేను నా కుటుంబాన్ని ఆసుపత్రికి పిలవలేదు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను" అని తన ప్రస్తుత దయనీయ స్థితిని వివరించారు.
ఆయనకు ఆర్థికంగా సహాయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. "నటుడు చిరంజీవి నాకు డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఒకసారి షూటింగ్ సమయంలో నాకు చిరంజీవితో గొడవ జరిగింది. కానీ ఆయన అంతా మర్చిపోయి నాకు సహాయం చేశారు. కానీ చాలా మంది నటులు నేను ఎలా ఉన్నానని అడగలేదు" అని పొన్నంబళం కృతజ్ఞతతో కూడిన ఆవేదనను వ్యక్తపరిచారు. పొన్నంబళం జీవితం ఒకప్పుడు వెండితెరపై వెలుగు జిలుగులతో నిండి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications