OG.. యే క్యా హోగయా జీ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఓజీ. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్.. కీలక పాత్రల్లో నటించారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది.
హరిహర వీరమల్లు తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఇదే కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. టీజర్లు, లిరికల్ సాంగ్స్.. మరింత హైప్ క్రియేట్ చేశాయి. కాగా- ఈ సినిమా విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లపై పరిమితిని విధించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే గెజిట్ కూడా జారీ అయింది.

జీఎస్టీ మినహాయించి కర్ణాటక వ్యాప్తంగా సినిమా టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదు. జీఎస్టీని కూడా కలిపితే 36 రూపాయలు అాదనం. అంటే మొత్తం సినిమా టికెట్ ధర రూ. 236 అవుతుంది. కొన్ని మల్టీప్లెక్స్‌లకు ఇందులో నుండి మినహాయింపు లభించింది. 75 సీట్లు లేదా అంతకంటే తక్కువ ప్రీమియం సదుపాయాలు ఉన్న మల్టీస్క్రీన్ సినిమాహాళ్లు 200 రూపాయల గరిష్ఠ టికెట్ ధర వర్తించదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
75 కంటే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లన్నీ కూడా 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ 36 రూపాయల కంటే ఎక్కువ టికెట్ ధరను ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయకూడదు. అది ఏ భాషా సినిమా అయినా సరే. అన్ని భాషల చిత్రాల ప్రదర్శనకు 200 రూపాయల గరిష్ట ధరను టికెట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక గెజిట్‌లో పొందుపరిచిన తేదీ నుండి ఈ నిబంధన అమలులోకి వస్తుంది.
కేజీఎఫ్ వంటివి తప్పించితే శాండల్ వుడ్ లో నిర్మితమయ్యే సినిమాలన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినవే. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంతారా బడ్జెట్ సైతం 14- 15 కోట్ల రూపాయల్లోపే. లేటెస్ట్ సూపర్ హిట్ సు ఫ్రమ్ సో కూడా అయిదు కోట్ల బడ్జెట్ తోనే రూపుదిద్దుకుంది. కన్నడ సినిమాలు హిట్ కాకపోయినా.. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమాలు చూస్తే ఖర్చు వస్తుందని శాండల్ వుడ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ ధరలపై పరిమితి విధించాలంటూ నిర్మాత సా.రా. గోవిందు.. సిద్ధరామయ్యతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఆయన కృషి ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందని సమాచారం.












Click it and Unblock the Notifications