బాక్సాఫీస్‌ను దడదడలాడించిన ఈ సెన్సేషనల్ మూవీకి అవార్డుల పంట
Golden Globe Awards 2024: క్రిస్టొఫర్ నోలన్ తీసిన మూవీ ఒప్పెన్‌హీమర్. గత ఏడాది విడుదలైన సంచలనం సృష్టించిన భారీ బడ్జెట్ మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. దానికి తగ్గట్టే కలెక్షన్ల సునామీని సృష్టించింది. విడుదలైన తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకుంది.
ఒప్పెన్‌హీమర్ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లతో నిర్మించారు. మన కరెన్సీతో పోల్చుకుంటే దీని నిర్మాణ వ్యయం సుమారుగా 820 కోట్ల రూపాయలు. భారత్‌లో 1,200 స్క్రీన్లల్లో విడుదలైందీ మూవీ. తొలి రోజే 2,900 షోలు ప్రదర్శించారు. అమెరికన్ న్యూక్లియర్ బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‌హీమర్ జీవిత కథ ఆధారంగా క్రిస్టొఫర్ నోలన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

మన్‌హట్టన్ మిషన్ నేపథ్యంలో సాగుతుందీ సైన్స్ ఫిక్షన్ మూవీ. టైటిల్ రోల్‌ను సిలియన్ మర్ఫీ పోషించారు. ఫ్లోరెన్స్, రాబర్ట్ డౌనీ, ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, జాక్ క్వైడ్.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. క్రిస్టొఫర్ నొలన్ అభిమానులను ఉర్రూతలూగించిన మూవీ ఇది. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలోనూ అతని మార్క్ కనిపించింది.
బాక్సాఫీస్‌ను దడదడలాడించిన ఒప్పెన్‌హీమర్ అదే స్థాయిలో అవార్డులను కొల్లగొడుతోంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులను డామినేట్ చేస్తోంది. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో క్రిస్టొఫర్ నోలాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కేటగిరీలో గట్టి పోటీని ఎదుర్కొన్నారాయన.

బ్రాడ్లే కూపర్ -మేస్ట్రో, గ్రెటా గెర్విగ్- బార్బీ, యోర్గాస్ ల్యాంథిమోస్- పూర్ థింగ్స్, మార్టిన్ స్కార్సెసె- కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, సెలీన్ సాంగ్- పాస్ట్ లైవ్స్.. ఉత్తమ దర్శకుడి అవార్డు కోసం పోటీ పడ్డారు. వారిని అధిగమించి క్రిస్టొఫర్ నోలాన్.. ఈ అవార్డును అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తమ నటుడిగా ఒప్పెన్‌హీమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డును అందుకున్నారు. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ఈ సినిమా ఆధిపత్యం కనిపించింది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2024 ప్రదానోత్సవం.. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో గల బేవర్లీ హిల్టన్ హోటల్‌లో కొనసాగుతోంది. ఒప్పెన్‌హీమర్‌కు సంగీతాన్ని సమకూర్చిన స్వీడిష్ కంపోజర్ లుడ్విగ్ గొరాన్సన్.. బెస్ట్ స్కోర్ అవార్డును అందుకున్నారు. పూర్ థింగ్స్ హీరోయిన్ ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications