చరిత్ర సృష్టించిన మరాఠీ గ్రిప్పింగ్ సైకలాజికల్ ఫోక్లోర్ థ్రిల్లర్.. !!
మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్.. గోంధల్. భారత చలనచిత్ర పరిశ్రమలో ఓ నూతన ఒరవడికి తెరతీసిందన ఈ మూవీ.. 99వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైంది. అదొక్కటే కాదు.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సహా ఏడు భాషల్లో పాన్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రీరిలిజ్ చేశారు. మరాఠీ జానపద సంస్కృతికి దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు తోడవడంతో ఈ చిత్రం సినీ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది.
1851 నాటి చారిత్రక నేపథ్యం
గత ఏడాది నవంబర్ 14న ఈ సినిమా విడుదలైంది. కిశోర్ కదమ్, ఇషిత దేశ్ ముఖ్, యోగేష్ సొహొని, నిషాద్ భోయిర్.. కీలక పాత్రలను పోషించారు. దర్శకుడు సంతోష్ దవాకర్ తెరకెక్కించిన చిత్రం ఇది. 1851 నాటి చారిత్రక నేపథ్యంలో, గ్రామీణ వాతావరణంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో ఒకే ఒక్క రాత్రిలో జరిగే అనేక నాటకీయ పరిణామాల ఆధారంగా ఈ కథ తెరకెక్కింది.

సాంప్రదాయ జానపద పూజా విధానం
గోంధళ్ అనేది దేవతల అనుగ్రహం కోసం నిర్వహించే సాంప్రదాయ జానపద పూజా విధానం దీని చుట్టూ అల్లుకున్న కథ, కథనం, చిత్రీకరణ విధానం.. గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఓ వివాహ వేడుక నేపథ్యంలో సాగే ఈ కథలో అసూయ, పగ, ఆధిపత్య పోరు, పాత కక్షలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. పెళ్లి వేడుకలో భాగంగా దుష్టశక్తులను తరిమికొట్టి శుభం కలగాలని నిర్వహించే సాంప్రదాయ గొంధళ్ పూజ జరిగే సమయంలో వేర్వేరు వ్యక్తుల మధ్య ఉన్న రహస్యాలు ఏ విధంగా బయటపడ్డాయనేది దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు.
సింగిల్ ట్రాకింగ్ షాట్
ఈ సినిమా ప్రారంభంలో వచ్చే దాదాపు 30 నిమిషాల సన్నివేశం వీక్షకులను నేరుగా కథా వాతావరణంలోకి తీసుకెళ్తుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అమలేందు చౌదరి చిత్రీకరించిన లార్జెస్ట్ సింగిల్ ట్రాకింగ్ షాట్.. ఈ సినిమాకు హైలైట్. గ్రామీణ వాతావరణం, ప్రధాన పాత్రల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాలను అత్యంత సహజంగా పరిచయం చేస్తుంది. ఊరి పెద్ద తన మనుమడితో కలసి వెళ్లే సన్నివేశంతో మొదలయ్యే ఈ ఘట్టం.. గ్రామంలో నెలకొన్న ప్రశాంతత వెనుక రగిలిపోతున్న అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
దివిటీలు, ప్రమిదలు, మంటల వెలుగుల్లో
సినిమా ప్రారంభంలో వచ్చే ఈ అరగంట సన్నివేశాన్ని ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ టేక్ లో చిత్రీకరించారు. రాత్రివేళ.. సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎలాంటి లైటింగ్‌ను ఉపయోగించలేదు చిత్రం యూనిట్. 1851 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా దివిటీలు, ప్రమిదలు, మంటల వెలుగుల్లో మెజారిటీ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చీకటి, వెలుగుల ప్రాధాన్యత కథలోని మానసిక అశాంతికి అద్దం పట్టినట్టయింది.
ప్రాణవాయువుగా
ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణవాయువుగా నిలిచింది. సన్నివేశాల తీవ్రతను దెబ్బతీయకుండా సంగీతాన్ని అండర్ ప్లే చేశారు. జానపద స్వరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిశ్శబ్ధ వాతావరణం ఎంతగా భయపెడుతుందనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవచ్చు. ఇళయరాజా అందించిన స్వరాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. సంప్రదాయ జానపద శైలికి తనదైన మార్కును జోడించారు.
క్యూ షీట్ ను అనుసరిస్తూ
ఈ సినిమా ఆస్కార్ రేసులోకి వెళ్లిన సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ మ్యూజిక్ కేటగిరీ పరిశీలన కోసం చిత్రంలో ఉపయోగించిన ప్రతి స్వరానికి సంబంధించి క్యూ షీట్ ను సమర్పించాల్సి ఉంటుంది. క్యూ షీట్ అంటే సినిమాలో ఏ సంగీతం ఎక్కడ వచ్చిందో తెలిపే వివరణాత్మక అఫీషియల్ డాక్యుమెంట్. క్యూ షీట్ ను అనుసరిస్తూ సంగీతాన్ని సమకూర్చే అలవాటు ఇళయరాజా కేరీర్ లోనే లేదు. అప్పటికప్పుడు కథ, కథనం, చిత్రీకరణ, వాతావరణాన్ని బట్టి సంగీతాన్ని సమకూర్చుతారు.
గ్రామీణ ఆచారాలు వ్యవహారాలు
క్యూ షీట్ కు బదులుగా తన ఆలోచనా విధానానికి అనుగుణంగా అప్పటికప్పుడు ఇళయరాజా స్వరాలను సమకూర్చారని, ఆస్కార్ కమిటీకి ఇదే విషయం చెబుతానని దర్శకుడు సంతోష్ దవాకర్ పేర్కొన్నారు. గ్రామీణ జానపద కథలను నిజాయితీగా తెరకెక్కిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతాయని 'గోంధళ్' నిరూపించింది. గ్రామీణ ఆచారాలు వ్యవహారాలు, మనుషుల మనస్తత్వాలపై లోతైన పరిశీలనగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందుతోంది.













Click it and Unblock the Notifications
