బర్త్‌డే రోజున బిగ్ బి ప్రస్థానం.... మీకోసం...
బిగ్ బి అనే పేరు చెప్పగానే అందరికీ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ గుర్తుకొస్తారు. ఎందుకంటే, అమితాబ్ బచ్చన్‌ను అందరూ బిగ్‌బి అని పిలుస్తారు. కానీ, ఆయన ఇప్పుడు అనుభవిస్తున్న జీవితంలా ఒకప్పుడు అంత బిగ్ గా లేదని తెలుసా? ఆయన తొలిరోజుల్లో సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక, రాక ఎన్నో కష్టాలను అనుభవించారు. కడుపు నిండా అన్నం తినడానికి కూడా డబ్బులు లేక పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి స్థాయి నుంచి నేడు బాలీవుడ్ షెహాన్‌షాగా పేరు సంపాదించుకున్నారు.
ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎంతోమంది ఆయనను విమర్శించినా ఏ మాత్రం అదరకుండా బెదరకుండా నిలబడ్డారు. నేటి యువతరానికి, ఎంతో మంది హీరో హీరోయిన్లకు ఆయన జీవితం ఒక స్పూర్తిదాయకం..నేడు అక్టోబర్ 11. బిగ్‌బి... బాలీవుడ్ షెహాన్‌షా... అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు నేడు. 81వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి...

అమితాబ్ జీవితంలో అతని పాత్ర ఎంతో కీలకం : కవి, స్వాతంత్య్ర సమరయోధుడు హరివంశరాయ్ బచ్చన్, తేజి బచ్చన్ దంపతులకు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11, 1942న అలహాబాద్‌లో జన్మించారు. ఈ దంపతులకు అమిత్‌బాబ్ ప్రథమ పుత్రుడు. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ఎంత కీలకమే.. అలాగే.. అమితాబ్ జీవితంలో ఉన్న లక్ష్మణుడి పాత్ర కూడా అంతే కీలకం. అమితాబ్‌కు కూడా ఒక లక్ష్మణుడు ఉన్నాడనే విషయం అతి తక్కువ మందికే తెలుసు. ఆ లక్ష్మణుడి పేరు అజితాబ్ బచ్చన్.. అమితాబ్ బచ్చన్‌లో ఉన్న నటుడిని వెలికితీసింది అతనే. అతనిని ఎలాగైనా సినిమాల్లోకి పంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అజితాబ్ బచ్చన్.
అయితే, అప్పటికే హరివంశయార్ బచ్చన్ సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో అమితాబ్ బచ్చన్ జీవితం మధ్యతరగతి కుర్రాడి జీవితంలానే గడిచింది. కళాశాలలో చదివే రోజుల్లోనే అమితాబ్ ఎన్నో నాటకాలు వేశాడు. అయితే, కుటుంబ పరిస్థితులు ఆయనను నటనవైపు కాకుండా, ఉద్యోగం వైపు వెళ్లేలా చేశాయి. చదువు అనంతరం చెన్నైలోనూ, కలకత్తాలోనూ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే, అజితాబ్ మాత్రం అన్నను సినిమాల్లో ప్రయత్నించమని కోరూతునే ఉండేవాడు.

ఇందిరాగాంధీ రికమెండేషన్‌తో సినీ ప్రవేశం : అయితే, చివరకు ఇంట్లో వారితో ఉద్యోగం చేయను, సినిమాల్లో ప్రయత్నిస్తానని చెప్పాడు అమితాబ్. అయితే తండ్రితో పాటు తల్లి కూడా స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకుంది. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన తన తల్లి తేజికి ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధముండేది. ఆ సాన్నిహిత్యంతోనే ఇందిరిగాంధీ రాసిన లేఖ సహాయంతో ముస్లిం కవిగా, యుద్ధ ఖైధీగా 'హిందుస్తానీ' అనే చిత్రంలో (1969)లో అమితాబ్‌బచ్చన్ నటించారు. అప్పట్లో రాజేష్ ఖన్నా మంచి ఫామ్‌లో ఉండేవారు. అప్పటి దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా రాజేష్‌ఖన్నా వంటి అగ్రహీరోలకే అవకాశాలు ఇచ్చేవారు. ఆ తరుణంలో అమితాబ్‌కి అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆయన మొదట నటించిన రెండు చిత్రాలు అంత పేరు సంపాదించలేదు.
మూడో చిత్రం 'ఆనంద్' (1971) మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోని వైద్యుని పాత్రకు ఆయనకు ఉత్తమ సహాయనటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. 1971-1972 సంవత్సరాల్లో ఆయన నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 1973లో 'జంజీర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ హిట్ కొట్టింది. దివార్ (1975), త్రిశూల్ (1978), అగ్నిపథ్ (1990) చిత్రాల్లో నటించారు. అయితే ఆయన నటించిన ల్యాండ్ మార్క్ చిత్రం 'షోలే'గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఆయన ధర్మేంద్రతో కలిసి నటించారు. ఈ చిత్రం తర్వాత 'అమర్ అక్బర్ ఆంథోనీ, దో ఔర్ దో పాంచ్, షాన్, నసీబ్, సత్తే పే సత్తా, నమక్ హలాల్ వంటి చిత్రాల్లో నటించారు.

రాజకీయాల్లో : తాను నటించిన 'అభిమాన్' సినిమా విడుదలకు ఒక నెల ముందు సహ నటి అయిన జయాభాదురిని 1973లో వివాహం చేసుకున్నాడు. రాజీవ్‌గాంధీ, అమితాబ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ సాన్నిహిత్యంతో రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌పార్టీలో చేరి అలహాబాద్‌నుండి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడేళ్ల తర్వాత భోఫోర్స్ కుంభకోణంలో చిక్కుకుని రాజకీయాల నుంచి తప్పుకున్నారు అమితాబ్ బచ్చన్. అయితే బోఫోర్స్ కుంభకోణంలో బచ్చన్ ప్రమేయం లేదని 2012లో తేలింది. అయితే, ఆ తర్వాత 'ఎబిసిఎల్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు అమితాబ్. ఎబిసిఎల్‌తో నిర్మించిన సినిమాలు బారీ నష్టాలనే మిగిల్చాయి. దీంతో ఆర్థికంగానూ అమితాబ్ ఎన్నోఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
'కౌన్ బనేగా కరోడ్‌పతి' షో తో మళ్లీ ఫామ్‌లోకి : ఆర్థికంగా ఎంతో నష్టపోయిన అమితాబ్‌ని 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షో ఆదుకుంది. ఎవరైతే అమితాబ్‌ను విమర్శించారో వారే ఆయనను ప్రశంసించేలా చేసింది ఈ షో. ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్‌ఫాల్కే వంటి అవార్డులు సైతం వరించాయి.












Click it and Unblock the Notifications