ఆ ఒక్కరోజే అన్ని తెలుగు సినిమాలు రిలీజా?
హైదరాబాద్/అమరావతి: తెలుగు సినిమాలు ఇక వెల్లువెత్తనున్నాయి. ఉప్పెనలా ముంచెత్తడానికి సిద్ధమౌతోన్నాయి. ఒకట్రెండు భారీ బడ్జెట్‌తో పాటు చిన్న సినిమాలు కూడా ఈ నెలలోనే విడుదల కావడానికి క్యూ కట్టాయి. తమ అభిమాన హీరో, దర్శకుడి సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతోండటంతో ప్రేక్షకులకు చేతినిండా పని ఉన్నట్టే.
ఈ నెల 28వ తేదీన మొత్తంగా అయిదు సినిమాలు విడుదల కావడానికి రెడీ అయ్యాయి. ఇందులో రెండు.. భారీ బడ్జెట్ మూవీలు. అదే రేంజ్‌లో స్టార్ క్యాస్ట్ ఉన్నవీ. వాటిపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అవి ఎంత వరకు ఈ హైప్‌ను అందుకుంటాయనేది విడుదల రోజున ఫస్ట్ షోతోనే స్పష్టమౌతుంది.

ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతోన్న సినిమాల్లో ఒకటి స్కంద. ఇది 28వ తేదీ నాడే విడుదల కాబోతోంది. రామ్ పోతినేని హీరో. శ్రీలీల హీరోయిన్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా ఇది. అఖండ బ్లాక్ బస్టర్ తరువాత ఆయన దర్శకత్వంలో వస్తోన్న తరువాతి సినిమా ఇదే కావడం వల్ల దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
నిజానికి- ఈ నెల 15వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఆ రోజున కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు ఉండటం వల్ల పోస్ట్ పోన్ అయింది. బోయపాటి మార్క్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందీ మూవీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.

28వ తేదీ నాడే చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజినీకాంత్, జ్యోతిక, నయనతార కాంబోలో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చంద్రముఖి 2 మీదా హైప్ క్రియేట్ అయింది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, వడివేలు, సుభిక్ష నటించిన ఈ సినిమాకు పీ వాసు దర్శకత్వం వహించారు.
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి నటించిన సినిమా రూల్స్ రంజన్ కూడా ఈ నెల 28వ తేదీ నాడే విడుదల కానుంది. రతినం కృష్ణ దర్శకుడు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరిప్రియారెడ్డి నటించిన సినిమా మ్యాడ్. ఇదీ ఆ రోజే ప్రేక్షకులను పలకరించబోతోంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. పెదకాపు పార్ట్ 1 ఈ నెల 29వ తేదీన థియేటర్లల్లో సందడి చేయబోతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.












Click it and Unblock the Notifications