జగపతిబాబు సంచలన నిర్ణయం
ప్రముఖ నటుడు జగపతిబాబు అభిమానుల ప్రవర్తనతో అసహనానికి గురయ్యారు. వారివల్ల తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని, ఇకనుంచి అభిమాన సంఘాలకు తాను దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. 33 సంవత్సరాల తన సినీ కెరీర్ లో ఎదుగుదలకు అభిమానులే ముఖ్యకారణమని భావించానన్నారు. వారి కష్టాలను తన కష్టాలుగా భావించానని, అన్నివిధాలుగా వారికి తోడుగా నిలిచానన్నారు.
అభిమానులు అంటే ప్రేమను పంచేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమకంటే ఆశించడమే ఎక్కువైందన్నారు. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇకనుంచి తన అభిమాన సంఘాలు, ట్రస్ట్ లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటిఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనను ప్రేమించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగానే ఉంటానని పోస్ట్ పెట్టారు.

జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు బయటకు వెల్లడికాలేదు. ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే సలార్, గుంటూరు కారం చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో నుంచి విలన్ క్యారెక్టర్ కు మారిన తర్వాత జగపతిబాబుకు ఎన్నో సినిమాల నుంచి, ఎంతోమంది దర్శకుల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆయా పాత్రల్లో జగపతిబాబు ఒదిగిపోవడంతో అందరికీ మొదటి ఆప్షన్ గా మారారు. ప్రస్తుతం ఎంతో బిజీ ఆర్టిస్టుగా మారారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, మళయాళం, కన్నడం, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications