ఏపీ సీఎం చంద్రబాబుతో హీరో నాగార్జున భేటీ.. కారణం అదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును.. హీరో నాగార్జున కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. అయితే గతంలో కూడా చంద్రబాబు, నాగార్జున కలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. దీంతో అనూహ్యంగా నాగ్ - సీఎంతో భేటీ అవ్వడం పట్ల చర్చ జరుగుతోంది.
అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్వరలోనే అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున రెండవ కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ - జైనబ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలోనే వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు.

ఈ నెల 6వ తేదీన వారి వివాహ వేడుక జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం కూడా ఇక్కడే జరిగింది.
అఖిల్ పెళ్లి చేసుకోనున్న యువతి జైనబ్ రవ్‌డ్జీ. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె. "Once Upon the Skin" అనే స్కిన్‌కేర్ బ్రాండ్ ద్వారా యువ ఎంట్రప్రెన్యూర్‌గా జైనబ్ గుర్తింపు పొందారు. హైదరాబాద్‌కు చెందిన జైనబ్ గత కొన్నేళ్లుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు. ఈ జంట నిశ్చితార్థం 2023 నవంబర్ 26న జరిగింది. ఇప్పటికే వివాహానికి సంబంధించి నాగార్జున, అమల దంపతులు.. పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించారు.
ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచే కాకుండా, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. వివాహానంతరం జూన్ 8న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, రాజస్థాన్‌లో ఓ లగ్జరీ రిసార్ట్‌లో ప్రత్యేకంగా మరో రిసెప్షన్ ను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications