హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీ కేస్ క్లోజ్.. చివరకు ఏం తేల్చారంటే ?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తనదైన శైలిలో పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఊహించని రీతిలో ముంబైలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వినిపించాయి. అయితే ఈ క్రమంలోనే సుశాంత్ కేసును టేకప్ చేసిన సీబీఐ దాదాపు నాలుగేళ్లపాటు ఈ కేసును దర్యాప్తు చేసి నివేదికను సమర్పించింది. తుది దర్యాప్తులో సుశాంత్ ది హత్య కాదని, ఆత్మహత్య చేసుకున్నాడని అందుకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదని పేర్కొంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణలు.. అలానే రియా చక్రవర్తి, సుశాంత్ కుటుంబంపై చేసిన ఆరోపణలకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సీబీఐ నివేదికను సమర్పించింది. ఇప్పటి వరకు ఈ కేసులో అనుమానితురాలుగా పేర్కొన్న రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో ఇక ఈ కేసును మూసివేస్తున్నట్టు ముంబయి స్పెషల్ కోర్టుకు నివేదికను అందజేసింది.
కానీ సుశాంత్ ఆత్మహత్యకు వారం రోజుల ముందుగా ఆయన మేనేజర్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం.. ఆ తర్వాత సుశాంత్ సింగ్ సైతం మరణించడం సర్వత్రా అనుమానాలకు దారి తీసింది. సుశాంత్ మేనేజర్ కేసు సైతం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. సుశాంత్ వ్యవహారంలో ముంబై పోలీసులు మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే, సుశాంత్ కుటుంబం రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020 ఆగస్టు 19న సీబీఐ ఈ కేసును స్వీకరించింది.
మరోవైపు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య నిపుణులు సైతం సుశాంత్ ది హత్య కాదని.. ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు. అయితే స్పెషల్ కోర్టు ఈ నివేదికను అంగీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ హీరో మరణం పట్ల ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికీ శోకాన్ని దిగమింగుతూనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications