తన పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేసిన కీర్తి సురేష్
గీతాంజలి అనే మళయాళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేను లోకల్, మహానటి తదితర సినిమాలు చేశారు. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేష్ తన అభినయంతో జాతీయ అవార్డును సాధించారు. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు.
ఫొటో షేర్ చేసిన కీర్తి సురేష్
కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా వాటన్నింటికీ అధికారికంగా చెక్ పెట్టింది. 15 సంవత్సరాల నుంచి తన స్నేహితుడు ఆంటోనీతో కొనసాగుతున్న పరిచయం ఇకనుంచి జీవితాంతం కొనసాగనుందంటూ తనతో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మొన్న దీపావళి సందర్భంగా వీరిద్దరూ ఈ ఫొటో దిగారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుంచే వీరిద్దరూ స్నేహితులు అని తెలుస్తోంది. దీనిపై సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఏడడుగులు నడవబోతున్న కీర్తిసురేష్
తన స్నేహితుడు ఆంటోనీతో కలిసి త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఇప్పుడు కీర్తి సురేష్ అధికారికంగా ప్రకటించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆంటోనీ విదేశాల్లో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత ఇండియాకు తిరిగివచ్చి వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కేరళలో ఉన్నాయి. పెద్దల అంగీకారంతో, ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. కీర్తి సురేష్ నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళంలో వచ్చిన తెరి సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న బేబీజాన్ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, అక్కడే కొన్ని సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. వివాహం డిసెంబరు 11 లేదంటే 12 తేదీల్లో జరిగే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications