'పుష్ప2' రూ.1850 కోట్లు నిజమేనా? లెక్కలు చూపాలని కోరిన ఇన్కమ్ టాక్స్ !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై 46 రోజులు పూర్తయింది. అనూహ్యంగా ఈరోజు ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈ సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు నిర్వహించారు. వీరితోపాటు మరో నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు, ఆయన భార్య, కూతురు, సోదరులపై కూడా దాడులు జరుగుతున్నాయి. పుష్ప2, దేవర సినిమాలకు ఫైనాన్స్ చేసిన రంగయ్య, అభిషేక్ అగర్వాల్ పై కూడా ఇవి కొనసాగుతున్నాయి. పుష్ప2 సినిమాకు మొదటిరోజు రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
పోటీలు పడి ప్రకటనలు
తర్వాత ప్రతి రెండు మూడురోజులకు అధికారికంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను ప్రకటించుకుంటూ వచ్చారు. రూ.294 కోట్ల నుంచి తాజాగా రూ.1850 కోట్ల వరకు ఆ నిర్మాతలు చేసిన ప్రకటనలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు జాగ్రత్తగా గమనించుకుంటూ వచ్చి హఠాత్తుగా దాడులు నిర్వహించారు. అగ్ర హీరోల సినిమాలకు నిర్మాతలు పోటీలుపడీ మరీ ఫేక్ కలెక్షన్లు చెబుతున్నారు. రికార్డులు తమ పేరుమీద ఉండాలని హీరోలు కోరడం, వారి ఒత్తిడికి లొంగి నిర్మాతలు ఇష్టమొచ్చినట్లుగా కలెక్షన్లు భారీసంఖ్యలో చెబుతుండటమే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది.

ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి
వాస్తవానికి పుష్ప2 సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? ఎక్కడెక్కడ విడుదల చేశారు? ఎంతవరకు గ్రాస్ వచ్చింది? షేర్ ఎంత? డిస్ట్రిబ్యూటర్లకు ఎంతకు అమ్మారు? వాటి వివరాలు, బయ్యర్లు ఎవరు? సినిమాకు ఎంత ఖర్చుపెట్టారు? ఫైనాన్స్ చేసింది ఎవరు? తదితర ప్రశ్నలతో ఐటీ అధికారులు మైత్రీ మూవీస్ నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. ప్రకటించిన రూ.1850 కోట్లకు లెక్కలు చూపించాలంటూ కోరినట్లు తెలుస్తోంది. వారు చెప్పినదాన్నిబట్టి అసలు ఈ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అనే వివరాలు బయటకు రానున్నాయి.
బయటకు రానున్న ఒరిజినల్ కలెక్షన్ల వివరాలు
ఐటీ అధికారుల రైడ్స్ తో ఈ సినిమాకు వచ్చిన ఒరిజినల్ కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపారం చేసేవారెవరైనా తమకు ఇంతే ఆదాయం వచ్చిందంటూ తక్కువ చేసి చూపడం సాధారణంగా జరుగుతుండేదే. అయితే సినీ పరిశ్రమలో మాత్రం ఎక్కువెక్కువగా చూపిస్తుండటం, ఐటీ ఫైల్స్ లో మాత్రం తక్కువ నమోదు చేయడం జరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కూడా సోదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications