Irumudi: ఇంత పెద్ద హిట్ కొట్టావ్ ఏంటన్నా..?
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద హీరోలు.. భారీ బడ్జెట్ సినిమాల్ని సైతం కథలో కంటెంట్ లేకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా పక్కన పెట్టేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా మంచి కథతో వచ్చిన సినిమాలను అవి చిన్న సినిమాలైనా సూపర్ హిట్ చేస్తున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఓ సినిమాను ఇష్టపడితే ఆ సినిమాను ఏ రేంజ్ కు తీసుకెళ్తారో ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ 'ఇరుముడి' సినిమాతో మరోసారి అది రుజువైంది. రవితేజ ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్తోంది.
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇరుముడి. మధ్యలో పాన్ ఇండియా మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఇరుముడికి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందని తెలిపారు. ఈ మేరకు ఇరుముడి సినిమా హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ కొత్త పోస్టర్ లో రవితేజ సాధారణ వ్యక్తిగా లుంగీ కట్టుకుని ఆరుబయట తలపై నుంచి బిందెతో నీళ్లు పోసుకుంటూ స్నానం చేస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది.
ఇక ఇరుముడి మూవీ నైజాంలో ఇరగదీస్తోంది. ఈ మూవీ తొలి వారంలోనే తెలంగాణ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏడు రోజుల ముగిసేసరికి నైజాం ఏరియాలో సుమారు రూ. 26 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు సమాచారం అందుతోంది.

ఇవాళ రాఖీ పౌర్ణమి.. ఆ తర్వాత శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో ఈ మూవీకి మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఈ మూవీ కేవలం తెలంగాణలోనే రూ.70 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడంపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇరుముడి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటించారు.












Click it and Unblock the Notifications