'జైలర్ 2'లో బాలయ్య? ఊహించని సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో పూనకాలే!
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠగా చర్చించుకుంటున్న వార్త.. ఇద్దరు అగ్ర నటులు, రెండు భిన్నమైన సినీ ప్రపంచాల దిగ్గజాలు, అసాధారణమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ - నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకే తెరపై సందడి చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సంచలన చిత్రం 'జైలర్ 2'లోనే ఈ అద్భుత, అరుదైన కలయిక చోటుచేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
2023లో విడుదలైన 'జైలర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, నెల్సన్ మార్క్ టేకింగ్, అదిరిపోయే యాక్షన్ ఎలివేషన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సినిమా విజయానికి మరో ప్రధాన కారణం ఇతర భాషా అగ్ర నటుల భాగస్వామ్యం. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ వంటి వారు కీలక అతిథి పాత్రల్లో మెరిసి, కథాగమనంలో కీలక మలుపులకు కారణమయ్యారు. ఇది సినిమా స్థాయిని, అప్పీల్‌ను మరింత పెంచింది. ఇప్పుడు 'జైలర్' కు కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2' లోనూ అదే మల్టీ-స్టారర్ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే, 'జైలర్ 2'లో అత్యంత కీలకమైన, శక్తిమంతమైన ఒక పాత్ర కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి బలంగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా, కథాగమనంలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు నెల్సన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని అంటున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలకృష్ణను కలిసి కథ చెప్పడం, పాత్ర ప్రాముఖ్యతను వివరించడం జరిగిందని, అందుకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తమిళ సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల 'జైలర్ 2' షూటింగ్ కూడా ప్రారంభం అయిన నేపథ్యంలో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, చిత్ర బృందం నుంచి లేదా బాలకృష్ణ కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషమేమిటంటే... 'జైలర్' మొదటి భాగం సమయంలోనే బాలకృష్ణను సినిమాలో భాగం చేయాలని తాను మొదట్లో అనుకున్నానని, అయితే ఆయనకున్న మాస్ ఇమేజ్ కు సరిపోయే పాత్రను అప్పట్లో సిద్ధం చేయలేకపోవడం వల్ల అది కుదరలేదని దర్శకుడు నెల్సన్ స్వయంగా ఒక సందర్భంలో వెల్లడించారు. ఇప్పుడు 'జైలర్ 2' కోసం బాలకృష్ణ ఇమేజ్, ఆయన ఎనర్జీకి తగ్గట్టుగా ఒక పవర్ ప్యాక్డ్ రోల్ ను నెల్సన్ సిద్ధం చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్త కనుక నిజమైతే, ఇది భారతీయ సినీ చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఇద్దరు దిగ్గజాలు, ఇద్దరు మాస్ మహారాజులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు కనులపండుగే. తమిళనాడులో రజనీకాంత్, తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణలకున్న క్రేజ్, వారిద్దరి కలయికపై అభిమానుల్లో అంచనాలు మాటల్లో చెప్పలేం. వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. రెండు పరిశ్రమల అభిమానులు కూడా ఈ అరుదైన కాంబోను తెరపై చూడటానికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు. ఈ అద్భుత కలయిక కనుక నిజమైతే, 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమంటున్నారు అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు.












Click it and Unblock the Notifications