ఒక్కో టికెట్ 2 వేలు.. అయినా సోల్డ్ అవుట్.. స్టార్ హీరోనా మజాకా.. !
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న హీరో విజయ్ కు ఇదే చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 'జన నాయగన్' టికెట్ ధర బెంగళూరులో రూ.2000 వరకు ఉంది. ఇంత ధర ఉన్నా విజయ్ చివరి మూవీ కావడంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
స్టార్ హీరో విజయ్ దళపతి 'జన నాయగన్' మూవీ విడుదలకు ముందే పలు రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ మూవీ టికెట్ ధర బెంగళూరులో రూ.2000 వరకు చేరింది. అయినా బెంగళూరులో స్పెషల్ మార్నింగ్ షోలు నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కావడం విశేషం. బెంగళూరులోని స్వాగత్ శంకర్ నాగ్, శ్రీ వినాయక.. తదితర థియేటర్లలో ఒక్కో టికెట్ ధర రూ.1000 నుంచి రూ.1500 వరకు అమ్ముడయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ షోలకు కనీస ధర రూ. 800 గా ఉంది. సాధారణ షోలు రూ. 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరోవైపు కేరళలోని కొచ్చిలో అత్యధిక టికెట్ ధర రూ.350 మాత్రమే ఉంది. మరోవైపు తమిళనాడులో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
ఇక ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీ నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

జన నాయగన్ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రలు చేశారు. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ తో దూసుకెళ్తున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ఇది తన చివరి సినిమా అని విజయ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications