తాతకు జూనియర్ నివాళి
Jr NTR: నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి అర్పించారు. ఈ తెల్లవారు జామునే వారిద్దరూ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. నేరుగా సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. సమాధి చుట్టూ తిరిగారు. కొద్దిసేపు మౌనం పాటించారు. సమాధి వద్దే కూర్చుని తాతయ్యను స్మరించుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఘాట్ వద్ద రద్దీ నెలకొంది. అనంతరం అభిమానులు సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పలువురు ప్రముఖులు ఘాట్ వద్దకు రావాల్సి ఉన్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంకాస్సేపట్లో ఘాట్ వద్దకు రానున్నారు. నివాళి అర్పించనున్నారు. అలాగే ఈ ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ రసూల్‌పురాలో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించనున్నారు.
అనంతరం జూబ్లీహిల్స్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించనున్నారు. ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, విజయవాడలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.












Click it and Unblock the Notifications