'దేవర' రివ్యూ: కొరటాల ముంచాడా? తేల్చాడా?
ఆరు సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత మూడున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ కు తగిన సినిమాతో రావాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా సబ్జెక్ట్ ను, దర్శకుడిగా కొరటాల శివను ఎంచుకున్నాడు. జాన్వీకపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, మురళీశర్మ, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.
కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు
దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఎన్టీఆర్ పాత్ర పరిచయం చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ తోపాటు సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. సముద్రంలోని ఓడలపై కంటైనర్లు దొంగిలిస్తుంటారు ఎన్టీఆర్, సైఫ్. అయితే ఈ జీవితం వద్దనుకుంటాడు ఎన్టీఆర్. కావాలనుకుంటాడు సైఫ్ అలీఖాన్(భైర). ఆయుధాల కోసం దేవర, భైర మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇద్దరూ సమఉజ్జీలుగా నటించారు. సినిమా మొదటి భాగంలో ఉండేంత ప్రభావం రెండోభాగంలో కనిపించదు. క్లైమాక్స్ కు ముందు వచ్చే మలుపు ముందుగానే తెలిసిపోతుంది. అయితే వాటికి ముందు వచ్చే ఫైట్లు, వాటిని సముద్రంలో తీయడం బాగుంది. దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగంలో చూడాలి.

రెండు పాత్రల్లో సూపర్ అనిపించాడు
అయితే ఎన్టీఆర్ రెండు పాత్రల్లో సూపర్ అనిపించాడు. ఆయన పలికించిన భావోద్వేగాలు, ఫైట్లు సినిమాకు అదనపు ఆకర్షణ. సైఫ్ అలీఖాన్ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఈ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉంటాయి. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకు హైలైట్. అనిరుధ్ సంగీతం కూడా సినిమాపై మంచి ప్రభావమే చూపించింది. కొన్నిచోట్ల కొరటాల శివ మార్క్ డైలాగులున్నాయి. ఫైట్స్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. సినిమాను ముగించిన విధానం ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. దీంతో ఈ సినిమా చతికిలపడింది. ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలను కొరటాల ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. వాళ్లగురించి తెలుసుకోవాలంటే రెండో భాగం కోసం ఎదురుచూడాలంటూ రచయితగా కొరటాల అలా వదిలేశాడు. రచయితగా అతని పాత్రపై ఇది ఒక మచ్చ.












Click it and Unblock the Notifications