బలాన్ని చాటనున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలో బహిరంగసభ?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేమిటంటే త్వరలోనే తారక్ అభిమానులను కలవబోతున్నారని, అందుకు బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారని అందులో ఉంది.
తానే అందరినీ కలుస్తాను
దీంతో ఒక్కసారిగా అందరూ తారక్ వైపే చూస్తున్నారు. దేవర చిత్రం సందర్భంగా అభిమానులను కలవాలనుకున్నప్పటికీ ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారిని కలవలేకపోయారు. అలాగే తనకోసం అభిమానులెవరూ పాదయాత్ర చేయవద్దని తారక్ కోరుతున్నారు. తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి తాను జీవితకాలం రుణపడివుంటానని, వారి అపారమైన గౌరవానికి కృతజ్ఞతలని, తనను కలిసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నాని, వారి ఆసక్తిని తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని, అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులతో సమన్వయం చేసుకొని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల సమస్య రాకుండా సభను ఏర్పాటు చేద్దామని తెలిపారు.

బలాన్ని చాటాలనుకుంటున్నారా?
అయితే తారక్ నిర్ణయాన్ని మరో కోణంలో కూడా విశ్లేషకులు చూస్తున్నారు. కొన్నాళ్లుగా నందమూరి కుటుంబం తారక్ ను దూరం పెడుతోంది. నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వేయలేదు. బాలకృష్ణకు చాలా దూరంగా ఉంటున్నారు అనేకన్నా ఆయనే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని చెప్పొచ్చు. సఖ్యత కోసం కొందరు ప్రయత్నించారుకానీ కుదర్లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్పందించకపోవడమే వివాదాలు పెద్దవడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ అప్పటికే వారిమధ్య దూరం ఉంది. తారక్ తోపాటు కల్యాణ్ రామ్ కూడా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే మాటమీద ఉంటున్నారు. బహిరంగసభను ఏర్పాటు చేయాలనుకోవడం అంటే తన బలాన్ని చాటాలనుకుంటున్నారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. నందమూరి కుటుంబానికి, రాజకీయాల పరంగా ఏదైనా బలమైన ప్రకటన చేయాలనుకుంటున్నారేమోనని సినీ, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. బహిరంగసభద్వారా కేవలం అభిమానులను కలిసి ఆగిపోతారా? లేదంటే ముఖ్యమైన ప్రకటన ఏమైనా చేస్తారా? అనేది చూడాలి.












Click it and Unblock the Notifications