కంగనా రనౌత్ సీక్రెట్ మ్యారేజ్? గుట్టు విప్పిన ఫైర్ బ్రాండ్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ తన సినిమాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ సారి కంగనా రనౌత్ పర్సనల్ లైఫ్, పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద తుఫానే సృష్టించాయి. ఇటీవల ముంబై వీధుల్లో కంగనా రనౌత్ కనిపించిన ఓ లుక్ చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రం, చేతులకు పచ్చటి గాజులు, పెద్ద బొట్టు పెట్టుకుని పూర్తిగా ఓ పెళ్లయిన స్త్రీ రూపంలో కంగనా రనౌత్ దర్శనమిచ్చింది. దాంతో కంగనా రనౌత్ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుందా? అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది.
క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
ఈ పెళ్లి పుకార్లు హద్దులు దాటిపోవడంతో ఎట్టకేలకు కంగనా రనౌత్ స్వయంగా స్పందించి ఈ వివాదానికి తెరదించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె క్లారిటీ ఇస్తూ.. తనకు ఇంకా వివాహం కాలేదని స్పష్టం చేసింది. "నాకు పెళ్లి కాలేదు. ఓ వివాహిత లుక్‌లో కనిపిస్తే దాన్నంత పెద్ద ఇష్యూ చేయాలా? నటీనటులుగా మేం కథ డిమాండ్ మేరకు రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఇది కేవలం నా సినిమా షూటింగ్‌లో భాగం మాత్రమే" అని కంగనా రనౌత్ నెటిజన్ల అంచనాలకు బ్రేక్ వేసింది.

దొంగచాటుగా పెళ్లి చేసుకోను.. కంగనా కౌంటర్
సినిమా షూటింగ్ కోసం తాను ప్రతిరోజూ ముంబై సిటీలో తిరుగుతున్నానని.. ఆ సమయంలో ఎవరో అకస్మాత్తుగా ఫోటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టడం వల్లే ఈ పుకార్ల బజార్ వేడెక్కిందని కంగనా రనౌత్ వెల్లడించింది. తన శైలికి తగ్గట్టుగానే అభిమానులకు ఓ నమ్మకాన్ని ఇస్తూ.. "ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తానికి తెలిసేలా గ్రాండ్‌గా చేసుకుంటాను కానీ, ఇలా దొంగచాటుగా, రహస్యంగా మాత్రం అస్సలు చేసుకోను" అని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న పెళ్లి గాసిప్స్ అన్నింటికీ చెక్ పడినట్లయింది.
Kangana Ranaut was seen wearing a mangalsutra today.
— Mr SP (@Lonely_prabh) May 21, 2026
Has Kangana secretly got married? pic.twitter.com/wBCoNCZVLL
రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. కంగనా సినిమాల్లో పూర్తి బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తున్న 'భారత్ భాగ్య విధాత' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2008 నాటి ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది రోగుల ప్రాణాలను ఎలా కాపాడారనే యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూన్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. విశేషమేమిటంటే.. బాక్సాఫీస్ వద్ద కంగనా సినిమా.. స్టార్ సింగర్, యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ చిత్రంతో తలపడనుంది. దీంతో రాజకీయాలు, సినిమాల నడుమ కంగనా ఈ కొత్త చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications